పార్టీలకు కీలకమైన ఓల్డ్ మైసూర్

కర్ణాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మే 10న పోలింగ్ జరగాల్సి ఉండగా మండుటెండలను సైతం లెక్క చేయకుండా పార్టీలు, కార్యకర్తలు జనంలో తిరుగుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో వచ్చిన వ్యతిరేకతలు చల్లారిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రచారంపైనే దృష్టి పెట్టారు.

నాడు జేడీఎస్ కు కంచుకోట..

224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ఓల్డ్ మైసూర్ ప్రాంతం కూడా కీలకమేనని చెప్పాలి. అక్కడ 66 అసెంబ్లీ సీట్లున్నాయి. ఉప ప్రాంతీయ పార్టీగా పేరు పొందిన జేడీఎస్ బలం మొత్తం ఓల్డ్ మైసూర్ లోనే ఉందని చెప్పక తప్పదు. పార్టీ కింగ్ కావాలన్నా, కింగ్ మేకర్ గా స్థిరపడాలన్న ఓల్డ్ మైసూర్ లో గెలిచే స్థానాలపైనే ఆధారపడి ఉంటుంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఓల్డ్ మైసూరు కుల రాజకీయాల కారణంగా జేడీఎస్ చేతిలోకి వెళ్లిపోయింది. అక్కడి మైసూరు, మాండ్యా, హసన్, రామనగరా, చామరాజ్ నగర్, చిక్ బళాపూర్, కోలార్, కొడగు జిల్లాల్లో జేడీఎస్ కు ఎక్కడ లేని బలం వచ్చేంది. ఒక్కళిగ సామాజిక వర్గానికి చెందిన దేవెగౌడ కుటుంబం ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వచ్చింది.

ఒక దశలో జేడీఎస్ 58 స్థానాలు గెలిస్తే అప్పుడు ఎక్కువ ఓల్డ్ మైసూర్ నుంచి సాధించింది. గత ఎన్నికల్లో జేడీఎస్ 37 స్థానాలతో సరిపెట్టుకోగా అందులో 30 ఓల్డ్ మైసూరు జిల్లాల నుంచి గెలిచినవే ఉన్నాయి.

2018 తర్వాత మారిన పరిస్థితి….

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడీఎస్ కు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. 2018లో గెలిచిన ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది ఇప్పుడు పార్టీలో లేరు. నలుగురు బీజేపీలో చేరగా, ముగ్గురు కాంగ్రెస్ వైపుకు వెళ్లిపోయారు ఇద్దరు చనిపోగా జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ ఓడిపోయింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మండ్యా లోక్ సభా స్థానంలో జేడీఎస్ అభ్యర్థి ఓడిపోవడం పెద్ద షాక్. ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత అంబరీష్, జేడీఎస్ అభ్యర్థిని ఓడించారు. ఆమె ఇప్పుడు బీజేపీ మద్దతుదారుగా ఉండటం కమలం పార్టీకి కలిసొచ్చే అంశం.

రెండు సంవత్సరాల క్రితం శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో సైతం ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ పార్టీకి ఎదురుగాలి వీచింది. హసన్, మైసూర్ – చామరాజ్ నగర్ లో మాత్రమే జేడీఎస్ గెలిచింది. మాండ్యా, కోలార్, టుంకూర్ లో ఓడిపోయింది. దానితో ఇప్పుడు జేడీఎస్ అసలు బలం తెలిసే అవకాశాలు తగ్గిపోయాయి. అది బలుపా, వాపా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు..

బలపడుతున్న బీజేపీ

ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో బీజేపీ బలపడుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఒక్కళిక సామాజికవర్గాన్నిఆకట్టుకునే ప్రయత్నాలు ఫలించాయని చెబుతున్నారు. ఒక్కళిగతో పాటు లింగాయత్ లను కూడా కలుపుకుపోతే ఓల్డ్ మైసూర్ మొత్తాన్ని గెలుచుకోవచ్చని బీజేపీ లెక్కలేసుకుంటోంది కేఆర్ పేట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పార్టీ జోష్ మీదుంది. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండా కూడా పార్టీకి ఉపయోగపడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ 20 చోట్ల ప్రసంగిస్తారని చెబుతుండగా.. ఓల్డ్ మైసూర్ లో ఎక్కువ సభలు ఉండేట్టుగా బీజేపీ వ్యూహకర్తలు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు.

బీజేపీ రాకతో ఒల్డ్ మైసూరులో ఇప్పుడు ముక్కోణ పోటీ నెలకొంది. ఒక్కళిగ వర్గానికి చెందిన డీకే శివకుమార్ ను పీసీసీ అధ్యక్షుడిగా చేయడంతో ఆయన ప్రాలబ్యం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి….