ఒడిశా రైలు ప్రమాదం – సిబీఐ విచారణతో నిజాలు వెల్లడయ్యే అవకాశం

ఒడిశా బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకే ట్రాక్ పై ఢీకొన్న ప్రమాదం జరిగి ఐదు రోజులైంది. అటు ఇటుగా 280 మంది చనిపోగా,వెయ్యి మంది వరకు క్షతగాత్రులయ్యారు. యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు, ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. ఆ రూట్లో ఇప్పుడు రైళ్లు యథావిథిగా నడుస్తున్నాయి. ప్రమాదానికి కారణాలపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందని కచ్చితమైన అభిప్రాయానికి వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

కుట్ర కోణంలో సీబీఐ విచారణ

రైలు ప్రమాదానికి విపక్షాలు రైల్వే శాఖను బాధ్యులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ నిర్లక్ష్యం, చేతగానితనం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ ఆయన తక్షణమే రాజీనామా సమర్ఫించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రమాదంపై బాలాసోర్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) కేసు నెంబర్ 64 నమోదు చేసింది. అయితే ఏదో కుట్ర జరిగి ఉంటుందన్న అనుమానంతో రైల్వే మంత్రి వైష్ణవ్ స్వయంగా సీబీఐ విచారణ కోరారు. నిజానికి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ కూడా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.కుట్ర కోణంలో లోతైన విచారణ జరగాలన్న లక్ష్యంతోనూ, ప్రాథమిక విచారణలో వెల్లడైన కొన్ని అంశాలను క్రోడీకరించాలన్న దృఢనిశ్చయంతోనూ సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ప్రమాదం బుద్ధిపూర్వక చర్యే…

ప్రమాదం జరిగిన మొదటి మూడు రోజుల్లోనే అనేక కోణాల్లో సమాచారం అందింది. వాటిని సీబీఐ లాంటి అత్యున్నత విచారణ సంస్థ మాత్రమే డీకోడ్ చేసే వీలుంది. మెయిన్ లైన్లో ప్రయాణించాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఆగి ఉన్న లూప్ లైన్లోకి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం వెదకడమే సీబీఐ ప్రధాన కర్తవ్యమవుతుంది. ఎవరో కావాలని సిగ్నలింగ్ వ్యవస్థలోకి దూరిపోకపోతే. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రూట్ మెయిన్ లైను నుంచి లూప్ లైన్లోకి వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు. అందుకే అందులో నిర్లక్ష్యం కంటే కుట్రకోణమే ఎక్కువ ఉందని చెప్పాల్సి వస్తోంది. స్థానిక పోలీసుల ఎఫ్ఐఆర్ ను తమదిగా మార్చుకుని సీబీఐ త్వరలో విచారణ చేపడుతుంది. కాస్త ఆలస్యమైనా అసలు కుట్రదారులను, వారి కుట్రలకు కారణాలను సీబీఐ నిగ్గు తేల్చే వీలుంది..

కరెంట్ షాకుతో 40 మంది మృతి..

రైలు ప్రమాద మృతుల్లో 40 మంది దేహాలపై ఎలాంటి గాయాలు లేవు. దీనిపై పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజం బయటకు వచ్చింది. గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పురా – హౌరా ఎక్స్ ప్రెస్ ఢీకొన్నప్పుడు బోగీలు ఉవ్వేత్తున ఎగిసి పడటంతో పైన ఉన్న లో టెన్షన్ విద్యుత్ వైరు తెగి రైళ్లలపై పడింది. అప్పుడు రెండు రైళ్లలో ఉన్న ప్రయాణికులకు కరెంట్ షాకు తగిలింది. చనిపోయిన ప్రయాణికుల్లో 40 మంది దేహాలపై గాయాలు గానూ, రక్తపు మరకలు కానీ లేకపోవడంతో వారు కరెంట్ షాకుకు గురై ఉంటారని ఆ దిశగా జీఆర్పీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.