లోక్ సభ ఎన్నికల్లో విజయానికి ప్రతీ రాష్ట్రం కీలకమేనని కేంద్రంలోని అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ తీర్మానించింది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ మినహా మిగతా చోట్ల పార్టీ కాస్త వీక్ గా ఉన్నప్పటికీ ఉత్తరాదిలో మాత్రం మూడు హిందీ రాష్ట్రాల విజయం తర్వాత మంచి జోష్ మీదుంది. ప్రతీ ఎన్నికకు వ్యూహాలు మార్చుతూ ముందుకు సాగుతున్న కమలం పార్టీ ఈ సారి యూపీ,బిహార్లో అత్యధిక స్థానాలు గెలిస్తే సొంత మెజార్టీకి ఢోకా ఉండదని ఎదురు చూస్తోంది..
కుల సమీకరణల్లో యాదవులే కీలకం
ఉత్తర ప్రదేశ్, బిహార్లో అత్యంత కీలకమైన ఓటు బ్యాంకులపై బీజేపీ దృష్టి పెట్టింది. ఉత్తర ప్రదేశ్లో యాదవుల ప్రయోజనాల కోసమే సమాజ్ వాదీ పార్టీ పనిచేస్తున్నా… బిహార్లో యాదవ పాలిటిక్స్ తో రాష్ట్రీయ జనతా దళ్ దూసుకుపోతున్నా ఆ రెండు పార్టీలకు ప్రజాదరణ తగ్గిందని బీజేపీ గుర్తించింది. ముఖ్యంగా లాలూ కుటుంబ అరాచకాలతో యాదవులు విసిగిపోయారని, మిగతా సామాజిక వర్గాలు వారిని దూరం పెట్టే పనిలో ఉన్నాయని బీజేపీ లెక్కలేసుకుంటోంది. దానితో ఇప్పుడు బీజేపీ యాదవులను ఆకర్షించే చర్యలు చేపట్టాలని భావిస్తోంది. బిహార్లో యాదవుల జనాభా 14 శాతం ఉంది. ఆర్జేడీ మాత్రమే వారికి ప్రతినిధి కాదని , బీజేపీ కూడా యాదవుల ప్రయోజనాలు కాపాడుతుందని నిరూపించే ప్రయత్నంలో ఉంది….
మధ్యప్రదేశ్ సీఎంకు బిహార్లో సన్మాన కార్యక్రమం..
ఇటీవలే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రి పీఠంగా కూర్చోబెట్టారు. ఆయన వచ్చిందే తడవుగా ప్రజ సంక్షేమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రకటించారు. బీజేపీ కూడా ఓబీసీ వర్గాలకు ప్రాధాన్యమిచ్చేందుకే మధ్య భారతంలో యాదవ సామాజికవర్గం నేతలు సీఎం చేశామని చెప్పుకుంటోంది. ఇప్పుడు మోహన్ యాదవ్ ను బిహార్ రప్పించి అక్కడ ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 18న పట్నాలోని ఎస్కేఎం మెమోరియల్ హాలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
యాదవ నేతలకు ఆహ్వానం
సమాజ్ వాదీ, ఆర్జేడీ కాని యాదవ నేతలందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి వేదికపై కూర్చోబెట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. దాని వల్ల లాలూ కుటుంబం ఒక్కటే యాదవ సామాజిక వర్గానికి ప్రతినిధి కాదని, ఇంకా చాలా మంది నేతలు, ప్రజా సంక్షేమానికి పనిచేసే నాయకులు బిహార్లో ఉన్నప్పటికీ అణచివేతకు గురయ్యారని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. యాదవులను మంచి చేసుకుంటే ఈ సారి 15 నుంచి 20 లోక్ సభా స్థానాల్లో విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ ఎదురుచూస్తోంది. ఈ సారి గెలిస్తే లాలూ, నితీశ్ ఇద్దరినీ దెబ్బకొట్టినట్లవుందని లెక్కలేసుకుంటుంది. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయ్యే లోపే యాదవులను అక్కున చేర్చుకునే ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ప్రయత్నిస్తున్నారు.