దక్షిణాదిలోకి విస్తరించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రయత్నాలు బెడిసికొట్టారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలు గెలుచుకోవాలనుకున్న ఆప్ కు పరాభవమే ఎదురైంది. ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ పార్టీకి కేవలం కర్ణాటక ఎన్నికల్లో కేవలం 0.58 శాతం ఓట్లు వచ్చాయి.
208 స్థానాల్లో పోటీ..
ఆప్ చాలా రోజులుగా ఢిల్లీలో అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో పంజాబ్ ను కూడా హస్తగతం చేసుకుంది. ఆ ఊపు మీదే దక్షిణాదిలో కూడా పాగా వేయాలనుకుని కర్ణాటకలో పోటీ చేసింది. 224 సీట్లకు గాను 208 చోట్ల ఆప్ అభ్యర్థులు బరిలోకి దిగారు. గదక్ జిల్లాలోని రోన్ గ్రామీణ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి అనేకల్ దొడ్డయ్య 8 వేల 839 ఓట్లు పొందారు. పోలైన ఓట్లలో ఆయనకు 4.96 శాతం దక్కాయి. ఆప్ అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి ఆయనే. బెంగళూరులో బాగా ఓట్లు సాధిస్తారనుకున్న బ్రిజేష్ కాలప్ప, మోహన్ దాసరి, మథాయ్ కూడా అట్టర్ ప్లాప్ అయ్యారు.
రెండు లక్షల మంది సభ్యులు
కర్ణాటకలో తమకు రెండు లక్షల మంది సభ్యులున్నారని ఆప్ చెబుతుంటుంది. కాకపోతే ఆ పార్టీకి రాష్ట్రం మొత్తం కలిపి కూడా 2.25 లక్షల ఓట్లే వచ్చాయి. తమను క్షేత్రస్థాయిలో బలం పెరిగిందని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని ఆప్ నేతలు చెప్పుకోవడమే గానీ ఆ పార్టీకి ప్రజా మద్దతు లభించడం లేదు. 208 మంది అభ్యర్థుల్లో 72 మంది మాత్రమే వెయ్యి ఓట్ల కంటే ఎక్కువ సాధించారు. కాంగ్రెస్ లో ఉంటూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన కాలప్ప కేవలం 600 ఓట్లు పొందారు. 2018 ఎన్నికల్లో ఆప్ తరపున 28 మంది అభ్యర్థులు రంగంలోకి దిగి మొత్తం మీద 20 వేల ఓట్లు సాధించారు..
బెంగళూరులోనూ అంతంతమాత్రమే..
ఆప్ ను ఓ అర్బన్ పార్టీగా చెబుతారు. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బెంగళూరు నగర పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 చోట్ల మాత్రమే ఆప్ అభ్యర్థులకు వెయ్యి ఓట్లు వచ్చాయి. మహదేవపురలో వరదలప్పుడు వీధి పోరాటాలు చేసిన ఆప్ కు అక్కడ కేవలం 4 వేల 551 ఓట్లు మాత్రమే వచ్చాయి. బెంగళూరు సౌత్ లో 2 వేల 585 ఓట్లు సాధించింది. తక్కిన నియోజకవర్గాల్లో చాలా తక్కువే వచ్చాయి. నిజానికి ఉత్తర కర్ణాటకలోని నియోజకవర్గాల్లో ఆప్ కు కాస్త మెరుగైన ఓట్లు వచ్చాయి. అక్కడ 19 స్థానాలుంటే మూడు చోట్ల మూడు వేల ఓట్ల కంటే ఎక్కువే వచ్చాయి.
అతి తక్కువ ఓట్లు రావడానికి ఆప్ చెబుతున్న కారణం కూడా కామెడీగా ఉంది. బీజేపీని ఓడించేందుకు జనం గెలిచే పార్టీకి ఓటేశారని, అందుకే మాకు తక్కువ ఓట్లు వచ్చాయని ఆప్ కర్ణాటక అధ్యక్షుడు పృధ్వీ రెడ్డి చెప్పుకుంటున్నారు. పైగా కొన్ని పార్టీలు ముస్లింలు, క్రైస్తవులకు డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కున్నాయని అందుకే తాము ఓడామని అంటున్నారు.
ఉత్తర కర్ణాటకలో తాము విజృంభించడం ఖాయమని ఆయన చెప్పుకుంటున్నారు. ఎవరి ధీమా వారిది…