రాహుల్ కాదు..అంతా ఆయన డూపే…

కాంగ్రెస్ నేతలు ఎంతకైనా ఒడిగడతారు.శ్రమ లేకుండా ప్రజామద్దతు కూడగట్టుకునేందుకు ఏ పనైనా చేస్తారు. బీజేపీ వాళ్లంతా జనంలో తిరుగుతూ రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు చిద్విలాసంగా తిరుగుతూ ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉంటారు. సాయంత్రానికి నాలుగు కబుర్లు చెప్పి సామాన్య జనాన్ని బుట్టలో వేసుకున్నామని తెగ సంబరపడిపోతారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ తానులో ముక్కే కదా. ఆయన కూడా అదే రూటులో ప్రయాణిస్తున్నారు..

రాహుల్ వెంట బాడీ డబుల్..

మనం డూప్ అంటాం. ఆంగ్లంలో కొందరు బాడీ డబుల్ అని పిలుస్తారు.భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు డూప్ ని వాడుతున్నారు. ప్రతీ చోట ఆయన కనిపించకుండా డూప్ తో పనికానిచ్చేస్తున్నారు. జనం కూడా అర్థం చేసుకోకుండా రాహుల్ గాంధీకే అభివాదం చేస్తున్నామని అనుకుని చేతులు ఊపేస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ మొత్తం విషయాన్ని బయట పెట్టడంతో జనం నోళ్లు నొక్కుకుంటున్నారు..మైళ్ల దూరం రాహుల్ నడిచినట్లు కనిపిస్తారని, దూరం నుంచి చూసి రాహుల్ వస్తున్నారని జనం సంబరపడిపోతారని అయితే అదంతా ఒట్టిమాటేనని హిమంత తేల్చేశారు. బస్సులో కూర్చుని రాహుల్ ఎంజాయ్ చేస్తుంటే ఆయన బాడీ డబుల్ జనంలో తిరుగుతూ షో చేస్తున్నారని హిమంత సాక్ష్యాలతో సహా నిరూపించారు.

బస్సులో కూర్చుని టీ తాగుతూ…

రాహుల్ గాంధీ కాసేపు నడుస్తారు. కాసేపు బస్సులో కూర్చుని ప్రయాణిస్తూ జనానికి అభివాదం చేస్తారు. భావోద్వేగానికి లోనైనట్లు కలరింగ్ ఇస్తారు. నిజానికి బస్సు లోపల వైపు ఎనిమిది మంది కూర్చోవచ్చు. అక్కడ రాహుల్ అనుచరులతో టీ. తాగుతూ, బిస్కెట్ తింటూ సరదాగా గడుపుతారు. బస్సు కిటికీ దగ్గర కూర్చునే బాడీ డబుల్ మాత్రం జనానికి చేతులు ఊపుతూ చిరునవ్వు చిందిస్తుంటారు…

ఇంతకీ ఎవరా బాడీ డబుల్

ఎగువ అసోంలోని జర్హాట్ ప్రాంతంలో యాత్ర జరుగుతున్నప్పుడు రాహుల్ బాడీ డబుల్ సంగతి బయటపడింది. రాహుల్ లాగే గెడ్డం, తెల్ల టీషర్టు వేసుకుని తిరిగే అతని పేరు రాకేష్ కుష్వాహా. మధ్యప్రదేశ్లోని భోపాల్ కు చెందిన అతను చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తాను రాహుల్ గాంధీ అభిమానినని రాకేష్ చెప్పుకుంటారు. యాత్ర తొలి దశలో రాహుల్ ను కలిసినప్పుడు తన వెంట ఉండాలని ఆయన కోరారట. దానితో న్యాయ యాత్ర సందర్భంగా రాహుల్ కు రాకేష్ బాడీ డబుల్ గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ యువనేతకు శ్రమ తగ్గిస్తున్నారు. బాడీ డబుల్ విషయం బీజేపీ బయటపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయింది.