రోజుని ఇలా ప్రారంభిస్తే మీ అంత ఆనందంగా ఎవ్వరూ ఉండరు

ఓ రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటాం..మరో రోజు చిరాగ్గా అనిపిస్తుంది..ఇంకో రోజు బద్ధకంగా ఉంటుంది.. మరి ప్రతిరోజూ సంతోషంగా మొదలవ్వాలంటే..రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే…ఇవి ఫాలో అవండి అని సూచిస్తున్నారు నిపుణులు..

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ముందుగా ఉదయాన్నే దినచర్య సక్రమంగా ప్రారంభం కావాలి. కొన్ని వ్యాపకాలు, మరికొన్ని అభిరుచులతో రోజును ప్రశాంతంగా మొదలుపెట్టాలి. సాధారణంగా 90 శాతం మందికి ప్రశాంతతను ఇచ్చే అలవాట్లు ఇవే..మీరు కూడా ట్రై చేస్తే చేయండి..

అలారాన్ని దూరంగా ఉంచండి
ఉదయాన్నే లేవడం అలవాటుగా మారిపోవాలి కానీ అలారం మోగనిదే లేవను అనే ఆలోచన వదులుకోవాలి. పైగా అలారం మోగినా కానీ ఆఫ్ చేసే దూరంలో ఉంటే దాన్ని ఆఫ్ చేసి మళ్లీ నిద్రపోవాలి అనిపిస్తుంది. అందుకే అలారాన్ని దూరంగా ఉంచాలి…అప్పుడు లేచి వెళ్లి ఆఫ్ చేస్తారు. ఆటోమేటిగ్గా బద్ధకం కొంచెం వదులుతుంది.

లేవగానే ఫోన్ వద్దు పుస్తకం తీసుకోండి
నిద్రలేచిన వెంటనే చాలామందికి ఫోన్ చూడడం అలవాటు. ఎవరు పట్టించుకున్నా లేకున్నా గుడ్ మార్నింగ్ లు చెప్పడం, స్టేటస్ లు పెట్టడం చేస్తుంటారు. కానీ చదవడం అనేది ఉదయాన్నే ప్రారంభించాలి. అదిమీకు నచ్చిన పుస్తకం ఏదైనా కానీ. ఈ అలవాటు మీ నుంచి కుటుంబంలో అందరూ నేర్చుకుంటారు కూడా..

పక్కను చక్కగా సర్దుకోండి.
నిద్రలేవగానే అలాగే చిందరవందరగా బెడ్ షీట్స్ వదిలేస్తారు. కానీ ఇది అస్సలు కరెక్ట్ కాదు. లేచిన వెంటనే మంచాన్ని నీటిగా సర్దుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇదో క్రమశిక్షణ కూడా.

మంచి ప్రణాళిక తయారు చేసుకోండి
రోజు ఎలా సాగాలో ఓ ప్రణాళికను ముందే వేసుకోండి. ఆరోజు చేయాల్సిన పనులు, కలవాల్సిన వ్యక్తుల ఇవన్నీ షెడ్యూల్ చేసుకోవడం ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది.

నవ్వుతూ పలకరించండి
నిద్రలేచిన వెంటనే చికాకు మొహంతో బయటకు రావొద్దు..లేచిన వెంటనే ఎదురుపడినవాళ్లని నవ్వుతూ పలకరించండి.

ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ రోజుని ప్రశాంతంగా మార్చేస్తాయి. ఇప్పటివరకూ మీకు ఈ అలవాట్లు ఉంటే వెల్ అండ్ గుడ్.. లేదంటే వీటిలో కొన్నైనా ట్రై చేసి… నిన్నటికి ఇవాల్టికి వ్యత్యాసం గమనించండి..