ఇండియా కూటమి సహా విపక్షాలు ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముజువాటి ఓటుతో మోదీ ప్రభుత్వం సభ విశ్వాసాన్ని పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆ సంగతి అర్థం చేసుకున్న విపక్షాల సభ నుంచి ముందే వాకౌట్ చేశాయి. మోదీ తన రెండు గంటల ప్రసంగంలో ఓ రేంజ్ లో విపక్షాలపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. వారి వల్లే ఇంతకాలం దేశం అధోగతి పాలైందని ఆరోపిస్తూ గత తొమ్మిదేళ్లుగా తాము దిద్దుబాటు చర్యలు చేపడుతూ వస్తున్నామని చెప్పారు.
అవిశ్వాసం మళ్లీ మళ్లీ పెట్టండి..
విపక్షం అవిశ్వాసం పెట్టినప్పుడల్లా అది తమకు ఆశీర్వాదంగానూ, దీవెనగానూ పరిణమిస్తోందని మోదీ అన్నారు. అవిశ్వాస తీర్మానం తమకు అదృష్టంగా పరిణమిస్తోందని అంటూ.. అది తమకు ఫ్లోర్ టెస్టు కాదని, విపక్షాలకు పరీక్షా సమయమవుతుందని అన్నారు. వోటింగ్ లో వాళ్లు ఓడిపోతూనే ఉన్నారని, జనంలోకి వెళ్లినప్పుడు వాళ్ల మీద అవిశ్వాసం ప్రకటితమవుతోందని మోదీ గుర్త చేశారు. విపక్షాలు ప్రవేశ పెట్టే అవిశ్వాస తీర్మానం తమకు మంచి శకునం అవుతుందని మోదీ చెప్పుకున్నారు.
ఉత్తుత్తిగా ఎందుకు…సిద్ధమై రండి..
2018లో తమపై అవిశ్వాస తీర్మానం పెడితే వీగిపోయిందని ఆ మరుసటి సంవత్సరమే జరిగిన ఎన్నికల్లో విపక్షాలను ప్రజలు చిత్తుగా ఓడించారని మోదీ గుర్తు చేశారు. ఈ సారి కూడా అదే జరగబోతోందని అంటూ పసలేని వాదనలతో , ప్రజా వ్యతిరేక చర్యలతో ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. మణిపూర్ అంశంపై అమిత్ షా పూర్తి వివరణ ఇస్తున్నప్పటికీ వాళ్లు గందరగోళం సృష్టించి తన సమాధానం కోసం పట్టుబట్టారన్నారు. 2028లో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలకు ప్రధాని ఆఫరిచ్చారు. అది 2029లో తమ గెలుపుకు లక్కీ ఛాన్స్ అవుతుందన్నారు. అప్పుడైనా పూర్తి ప్రిపేరేషన్ లో వస్తే బావుంటుందని సెటైర్లు వేశారు.
2018 లో తెలుగుదేశం అవిశ్వాసం
అప్పట్లో ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని 2018 జూలై 18న అవిశ్వాస ప్రస్తావన చేయగా కాంగ్రెస్, తృణమూల్, ఆర్జేడీ, ఆప్, ఎంఐఎం, వామపక్షాలు ఈ తీర్మానానికి మద్దతిచ్చాయి. మోదీ ప్రభుత్వం ప్రజామద్దతు కోల్పోయిందని విపక్షాలు ఆరోపించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని అవిశ్వాస తీర్మానం పెట్టారని అందులో జాతి ప్రయోజనమేదీ లేదని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. తమకు సంఖ్యా బలం లేదని,రాష్ట్ర సమస్యల పట్ల తమ ఆవేదనను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడుతున్నామని అప్పటి టీడీపీ ఎంపీ మాగంటి బాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.అవిశ్వాస తీర్మానంపై టీడీపీ నేతలు చేసిన ప్రసంగాలన్నీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సహా రాష్ట్ర అంశాలే వినిపించాయి. చివరకు తీర్మానం వీగిపోయింది. ఈ సారి కూడా సీన్ రిపీటైంది. అంతే…