ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా దృష్టి సారించాయి. ఇప్పటికే వైసిపి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్, అమలాపురం నుంచి మాజీ ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాద్, రాజమహేంద్రవరం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్లను ప్రకటించింది. కూటమి తరపున అభ్యర్థులు మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.
కాకినాడ ఎంపీ సీటులో పవన్ పోటీ చేస్తారా ?
కాకినాడ ఎంపీ స్థానానికి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రకటించారు. కానీ అమిత్ షా కోరితే తానే పోటీ చేస్తానని.. పిఠాపురంకు.. ఉదయ్ ను మారుస్తానని అన్నారు. అంటే.. ఇంకా డైలమా కొనసాగుతోంది. అమలాపురం, రాజమహేంద్రవరం అభ్యర్థులపై ఒక అవగాహనకు వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. టిడిపి, జనసేన, బిజెపి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించని టీడీపీ
మెజార్టీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టిడిపి ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. మంగళవారం టిడిపి ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని ప్రచారం జరిగినా మళ్లీ వాయిదా పడింది. రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం నుంచి బిజెపి అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేయనున్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం విడుదల కాలేదు. అమలాపురం ఉమ్మడి అభ్యర్థిగా టిడిపి నేత, లోక్‌సభ ఇన్‌ఛార్జ్ గంటి హరీష్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీకి ఇచ్చే అసెంబ్లీ సీట్లతో లింక్
అమలాపురం పార్లమెంటు అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపికపై వైసిపి దూకుడుగా ఉన్నప్పటికీ కూటమి స్థానాల ఖరారుపై ఇంకా స్పష్టత రాకపోవడంతో టిడిపి, జనసేన శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. బీజేపీకి కేటాయించాల్సిన అసెంబ్లీ స్థానంపై స్పష్టత రావాల్సి ఉంది.