నితీష్ ప్రయత్నం – విపక్షాల ఐక్యత సాధ్యమేనా ..?

బీజేపీతో స్నేహానికి, వైరానికి మధ్య దోబూచులాడే బీహార్ సీఎం నితీష్ కుమార్.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ఆయన పనిచేస్తూ అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది. బహుముఖ వ్యూహంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని స్వీకరించాలని ఆయన కోరుతున్నారు..

నితీష్ ఫార్ములా ఏమిటి ?

బీజేపీయేతర విపక్షాలకు దేశంలో 240 ఎంపీ స్థానాల వరకు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో మరో 70 నుంచి 100 స్థానాల వరకు సాధించగలిగితే అది పటిష్టమైన కేంద్ర ప్రభుత్వం అవుతుందని నితీశ్ అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ వారిని అనుసరించాలని, హస్తం పార్టీకి బలమున్న చోట ఆ పార్టీ లీడ్ తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు. యూపీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సమాజ్ వాదీ, ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎంలు నాయకత్వం బాధ్యత తీసుకుంటూ.. మధ్యప్రదేశా్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్లో కాంగ్రెస్ కు నాయకత్వం వదిలెయ్యాలన్నది నితీష్ ఫార్ములాగా చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వారి వారి బలాబాలలను బట్టి ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నారు. దక్షిణాదిన కాంగ్రెస్ కు సొంత మిత్రపక్షాలుండగా, కొన్ని రాష్ట్రాల్లో సొంత బలం మీద గెలిచే ప్రయత్నంలో ఉంది..

రాహుల్ ను ప్రొజెక్ట్ చేయొద్దంటున్న నితీష్

కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు నితీష్ సముఖంగా ఉన్నప్పటికీ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ఆయన ఒప్పుకోవడం లేదు. ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం విపక్షాల ఐక్యతను దెబ్బతీస్తుందని నితీష్ భావిస్తున్నారు. బీజేపీ మాత్రమే ఒకప్పుడు వాజ్ పేయి, ఆడ్వాణీ.. తర్వాత మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాయని విపక్షాలు ఎప్పుడూ ఆ పని చేయలేదని నితీష్ గుర్తు చేస్తున్నారు..

వ్యక్తుల ఆధారంగా కాకుండా అంశాల ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నితీష్, తేజస్వీ సహా కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, పెట్టుబడుల ఉపసంహరణ, దళితులపై అత్యాచారాలు, దౌర్జన్యాలు లాంటి ఆంశాలను జనంలోకి తీసుకెళ్లి ఎన్నికల అంశాలను చేయాలని నితీష్ ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటికే ఒకటి రెండు పర్యాయాలు మీటింగులు పెట్టడంతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో కూడా నితీష్ చర్చలు జరిపారు..

వాళ్లు ముగ్గురు ఒప్పుకుంటారా…

అఖిలేష్, మాయావతి, మమత.. ఆ ముగ్గురు నేతలకు కాంగ్రెస్ అంటేనే పడటం లేదు. ఓ సారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చేతులు కాల్చుకున్నానని అఖిలేష్ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇక మాయావతి, మమత ఇద్దరూ ప్రధానమంత్రి పదవిపై కన్నేసి చాలా రోజులైంది. అనేక రాష్ట్రాల్లో ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగిపోయిన కాంగ్రెస్ ను కలపుకుపోవడమంటే అదనపు లగేజీని మోయడమేనని ఇద్దరు మిహళా నేతలు భావిస్తున్నారు.కాంగ్రెస్ ను బతికించడమంటే తమ మనుగడను దెబ్బ తీసుకోవడమే అవుతుందని కూడా వారి వాదన..

స్టాలిన్ కు ఓకే.. కానీ…

డీఎంకే అధినాయకుడైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు కాంగ్రెస్ నాయకత్వంలో ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో కూడా ఆయన రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. కాకపోతే ద్రవిడ పార్టీల ఆలోచనలు ప్రతీ సారి ఒకేలా ఉండవు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. పైగా తమిళనాడులో ఉన్న 39 లోక్ సభా స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని స్టాలిన్ కు తెలుసు. అందుకే సాధ్యమైనంత వరకు ఆయన ఢిల్లీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

పీఎం అభ్యర్థిగా నితీష్… ?

ఎంత లేదన్నా, ఎంత వద్దన్నా ప్రధాని అభ్యర్థి కావాలన్న కోరిక నితీష్ లో ఉందనిపిస్తోంది. అందుకే ఆయన విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే బిహార్ లో నితీష్ ను సమర్థించినా.. జాతీయ స్థాయిలో మద్దతిచ్చేందుకు అఖిలేష్ తో పాటు లాలూ కుటుంబం ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే విపక్షాల్లో ప్రతీ ఒక్కరూ పీఎం అభ్యర్థే కదా.