నితిన్‌ ‘గడ్కరీ’ బయోపిక్‌ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్!

భారతీయ సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. వివిధ రంగాల్లో తమ ప్రత్యేకత చాటుకున్న ప్రముఖలు జీవిత కథలు వెండి తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఇప్పుడు మరో ప్రముఖుడి బయోపిక్‌ కూడా రానుంది. ఆయనే హైవే మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా నితిన్‌ గడ్కరీ. ఈ బయోపిక్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ చూద్దాం..

అక్టోబర్‌ 27న గడ్కరీ సినిమా విడుదల
భారత రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ జీవితం ఆధారంగా రూపొందుతున్న మరాఠీ చిత్రం ‘గడ్కరీ’. అక్షయ్ దేశ్‌ముఖ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనురాగ్ రాజన్ భూసారి దర్శకుడు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పోస్టర్‌, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. అయితే నితిన్ గడ్కరీ పాత్రలో ఎవరు నటిస్తారనే మాత్రం వెల్లడించలేదు. దీంతో కేంద్ర మంత్రి పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ప్రముఖ నటుడు రాహుల్‌ చోపాడే టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్ తో పాటూ రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. అక్టోబర్‌ 27న గడ్కరీ సినిమా విడుదల కానుంది. ‘ఈ దేశాన్ని రోడ్ల ద్వారా గుర్తిస్తే, నేను నితిన్ జైరామ్ గడ్కరీని అని ఆనందంగా చెప్పగలను’ అని టీజర్‌లో చెప్పినట్టే… గడ్కరీ రాజకీయ జీవితంలో పాటు వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా, న్యాయవాదిగా, కీలకమైన క్యాబినెట్ మంత్రిగా నితిన్‌ గడ్కరీ జీవితంలో చోటు చేసుకున్న ప్రధాన అంశాలను ఈ బయోపిక్‌లో ప్రస్తావించనున్నారు.

నితిన్ గడ్కరీకి అసాధారణ వ్యక్తిత్వం-దర్శకుడు
‘ సమకాలీన రాజకీయాల్లో నితిన్ గడ్కరీది అసాధారణ వ్యక్తిత్వం అన్నారు దర్శకుడు అనురాగ్ రాజన్ భుసారి. గడ్కరీ సినిమా పోస్టర్ విడుదలయ్యాక చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నితిన్ గడ్కరీ పాత్రలో ఎవరు నటిస్తారని చాలా మంది అడిగారు. ఒక సాధారణ కార్యకర్త, సామాజిక కార్యకర్త నుంచి కీలకమైన క్యాబినెట్ మంత్రి వరకు సాగిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మందికి ఈ ఇతర ప్రపంచాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. నితిన్ గడ్కరీ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండేవారో, ఎలా ఉన్నారో ప్రేక్షకులు ‘గడ్కరీ’ చూసి తెలుసుకోవచ్చు’ అని చెప్పుకొచ్చారు.

అయితే అక్టోబరు 27న విడుదల కానున్న ఈ గడ్కరీ మూవీ కేవలం మరాఠీలోనే వస్తుందా..ఇతర భాషల్లోనూ వస్తుందా అన్నది క్లారిటీ లేదు.