ఒబామాకు నిర్మలా సీతారామన్ కౌంటర్

కాంగ్రెస్ హయాంలో అమెరికా అంటే భయం. అమెరికాకు కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందోనన్న ఆందోళన అప్పటి పాలకుల్లో ఉండేది. అమెరికా వైపు నుంచి ఎలాంటి హెచ్చరిక వచ్చినా జీ హుజూర్ అనే వారు. వారికి కోపం రాకుండా చూసుకోవాలని అందరికీ సలహాలు వెళ్లేవి. ఇప్పుడు సీన్ మారింది. అమెరికాతో ద్వైపాక్షిక స్నేహం మన అజెండాలో ప్రధానాంశమైనప్పటికీ సమాన హోదా ఉండాలన్న వాదన మోదీ ప్రభుత్వంలో వినిపిస్తోంది. మనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం గట్టి సమాధానం చెప్పి తీరాల్సిందేనని టీమ్ మోదీ డిసైడైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న చేసింది కూడా అదేనని మరిచిపోకూడదు..

డేటా సరిచూసుకోకుండా మాట్లాడుతున్నారు..

నిర్మలమ్మ కాంగ్రెస్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. చర్చనీయాంశాలు కాని వాటిని బయటకు తీసుకొచ్చి ఎలాంటి డేటా సేకరణ జరగకుండా బుద్ధి పూర్వక బురద జల్లడం సహేతుకం కాదని ఆమె హెచ్చరించారు. కర్ణాటక మినహా కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదని గుర్తు చేస్తూ… ఎన్నికల్లో మోదీపై విజయం సాధించలేక కాంగ్రెస్ పార్టీ పస లేని ఆరోపణలు చేస్తోందని నిర్మలమ్మ అన్నారు. ప్రతీ విషయానికి మతాన్ని బయటకు లాగి దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదని ఆమె సమాధానమిచ్చారు.

ఓబామా తీరును ఎండగట్టిన నిర్మలమ్మ

ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలోనే ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ హుసేన్ ఒబామా.. సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ ముస్లింలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని సమస్యలను మోదీ వద్ద ప్రస్తావిస్తామని ఒబామా ఆ ఇంటర్వ్యూలో అన్నారు. భారత్ లో మైనార్టీ హక్కులు చర్చనీయాశమేనని వ్యాఖ్యానించారు. ఒబామా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు తమను తీవ్ర షాక్ కు గురిచేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటరిచ్చారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని నిర్మలమ్మ గుర్తు చేశారు. ఒబామా పాలనా కాలంలో ఆరు ముస్లిం దేశాలపై అమెరికా బాంబు దాడులు చేసిన సంగతిని ఆయన మరిచిపోయారని నిర్మలమ్మ ప్రస్తావించారు. ముస్లిం దేశాలపై 26 వేల బాంబులను జారవిడిచిన ఒబామా.. ఎంతో నిబద్ధతతో పనిచేసే మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు సంధిస్తున్నారని ఆమె ఎదురుదాడి చేశారు. భారత్ లో ఉన్నంత మత స్వేచ్ఛ ఎక్కడా ఉండదని ఆమె మరోసారి గుర్తు చేశారు.

హిమంతా బిశ్వా ఆగ్రహం

అసోం ముఖ్యమంత్రి హమంతా బిశ్వా శర్మ కూడా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లో ఉన్న హుసేన్ ఒబామాలను దారికి తెచ్చేందుకు అసోం పోలీసులు ప్రాధాన్యమిస్తారని అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడికి చురకలు అంటించారు. నిజానికి ఒబామా ఇలా ఎందుకు మాట్లాడారన్న అంశంపై దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయనను ఎవరైనా తప్పుదోవ పట్టించి ఉండొచ్చని ఒక వర్గం అంటోంది. ఎందుకంటే ఒబామా ఆచి తూచి మాట్లాడే నాయకుడు. ఆయన తీరుకు కారణాలు ఒకటి రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.