కేరళను వణికిస్తున్న నిఫా వైరస్

కొవిడ్ నుంచి పూర్తిగా విముక్తి లభించకముందే మరో వైరస్ మానవాళిని ఇబ్బంది పెడుతోంది. భారతీయులకు అది భయంకరం శాపంగా పరిణమించే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే మరణాలు సంభవించడంతో వైద్య నిపుణులు అలెర్ట్ అయ్యారు. దేశ ప్రజలకు తగిన జాగ్రత్తలు చెబుతున్నారు…

వైరస్ తో ఇద్దరు మరణం..

కేరళ ప్రజలను ఇప్పుడు నిఫా వైరస్ భయం వెంటాడుతోంది. కోళికోడ్ ప్రాంతంలో నిఫా వైరస్ తో ఇద్దరు దుర్మరణం పాలు కావడం కేరళ ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. మరో నలుగురి నమూనాలు టెస్టింగ్ కు పంపామని కేరళ సీఎం పినరయి విజయన్ స్వయంగా వెల్లడించారు. పుణె ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించిన వాటిలో రెండు శాంపిల్స్ పాజిటివ్ వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కోళికోడ్ జిల్లా పరిధిలోని ఏడు పంచాయతీల్లో ఈ వైరస్ కనిపించడంతో అక్కడ ప్రత్యేక ఆరోగ్య చర్యలు చేపట్టారు..

కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు…

బాధిత పంచాయతీల్లో కేరళ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేసింది. బయటి వాళ్లు అక్కడకు వెళ్లకుండా, అక్కడి వాళ్లు బయటకు తిరగకుండా కట్టుదిట్టం చేశారు. ఆ బాధ్యతను పోలీసు, రెవెన్యూ శాఖలను అప్పగించారు. ఆయా గ్రామాల్లోని వార్డుల్లో బ్యారికేడ్లు పెట్టి జనం కదిలికలను నియంత్రిస్తున్నారు. కన్నూరు, వాయినాడ్, మల్లపురం జిల్లాల్లో ప్రజలు కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వం హెచ్చరించింది. జనంలో వైరస్ ను నియంత్రించే యాంటీ బాడీస్ వచ్చేందుకు అవసరమైన ఔషదాలు ఇవ్వాలని భారత వైద్య పరిశోధనా మండలిని కేరళ వైద్య ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ కోరారు. ట్రేసింగ్, ట్రీటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు.

వ్యాధి లక్షణాలివి….

నిఫా వైరస్ ను జూనోటిక్ వైరస్ గా గుర్తించారు. జలుబుకు కారణమైన కొన్ని వైరస్లో ఒకటైన హ్యూమన్ పారా ఇన్ ఫ్లుయెంజా వైరస్ గానూ దాన్ని పరిగణిస్తున్నారు. కరోనా తరహాలోనే గబ్బిలాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అదీ విస్తరిస్తోందని గుర్తించారు. అది జంతువుల నుంచి మనుషులకు సులభంగా వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తి నుంచి వ్యక్తికి కూడా చేరుతుంది. కలుషితమైన ఆహారం ద్వారా కూడా వైరస్ ఇతరులకు చేరే ప్రమాదం ఉంది. 1999లో మలేషియాలోని సుంగై ప్రాంతంలో ఈ వైరస్ బయటపడింది. ఆ ప్రాంతం పేరును బట్టి నిఫా అని నామకరణం. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట లాంటివి వైరస్ లక్షణాలు, మైకం, మగత, నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి. 48 గంటల్లో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నిఫా వైరస్ వల్ల దగ్గు, గొంతునొప్పి, శ్వాస ఆడకపోవడం లాంటివి కూడా సంభవించే ప్రమాదముంది. సైడ్ ఎఫెక్ట్ గా మెదపు వాపు వ్యాధి కూడా రావచ్చు. ఎందుకైనా సరే జాగ్రత్తగా ఉండటం మంచిది….