అనంత జిల్లాలో సరికొత్త వైసీపీ – ముగ్గురు తప్ప అందరూ కొత్త అభ్యర్థులేనా ?

ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీ కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. ఈ సారి కూడా తాము విజయం సాధించేందుకు మేకోవర్ తో ముందుకు రావాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. అందుకే పది మంది అభ్యర్థుల్ని మార్చేాయలని నిర్ణయించుకున్నారు.

ముగ్గురికి మాత్రమే టిక్కెట్ భరోసా

అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వైసీపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కేవలం ముగ్గురికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో కన్ఫామ్‌గా టికెట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి మాత్రమే టికెట్ భరోసా కనిపిస్తోంది. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు భవిష్యత్‌పై రకరకాల చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యేల పనితీరుపై మొదటి నుంచి జగన్ అసంతృప్తి

రాయదుర్గం, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం, అనంతపురం ఎమ్మెల్యేలకు ఇప్పటికే టిక్కెట్ లేదని సమాచారం పంపారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు టికెట్ లేనట్లేనని ఇప్పటికే స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా.. ఆమె భర్త సాంబశివారెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పద్మావతి స్థానంలో ఒక డీఎస్పీని పోటీకి పెట్టే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ పరిధిలో ధర్మవరం మినహా మిగిలిన అన్నిచోట్లా అభ్యర్థుల మార్పు ఉండే అవకాశం ఉంది.

కీలక నియోజకవర్గాలన్నింటిలో కొత్త అభ్యర్థులు

రాప్తాడు, పుట్టపర్తి, మడకశిర, కదిరి, పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో కచ్చితంగా మార్పు ఉంటుందని చెబుతున్నారు. రాప్తాడులో పరిటాల కుటుంబంపై రికార్డు మెజార్టీతో గెలిచిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గ నేతలు కూడా ఆయన పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నట్టు నివేదికలు రావడంతో రిస్క్ తీసుకునేందుకు సీఎం జగన్ సిద్దంగా లేరు. ప్రకాశ్ రెడ్డి సోదరులు తమ ప్రవర్తనతో సీటు కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకున్నారంటున్నారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తిప్పేస్వామికి ఈ సారి మొండిచేయి చూపడం ఖాయమనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇక కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పరిస్థితి ఏమంత అనుకూలంగా లేనట్లు చెబుతున్నారు. సొంత పార్టీ నేతలే సిద్ధారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హిందూపురంపై ప్రత్యేక దృష్టి

చివరగా హిందూపురంలో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను ఇప్పటికే తప్పించి కురబ దీపికకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ, హిందూపురంలో స్ట్రాంగ్ లీడర్ నవీన్ నిశ్చల్ తనకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. టికెట్ రాకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితి ఉంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు అసలు టికెట్ దక్కే చాన్స్ లేదు.