ఏపీ బీజేపీకి కొత్త టీం – యువనేతలకే కీలక బాధ్యతలు !?

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పురందేశ్వరి కొత్త అద్యక్షురాలిగా నియమితులయ్యారు. పార్టీ దీర్ఖ కాల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర పార్టీలోనూ ఆమె మార్పు, చేర్పులు చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పురందేశ్వరి రాష్ట్ర రాజకీయాల్లో పరిమితంగానే ఉన్నారు. అయితే ఆమెకు రాష్ట్ర పార్టీని సమర్థంగా నిర్వహించడం పెద్ద విషయం కాదు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా కూడా పదేళ్లుగా పని చేసిన అనుభవం ఉంది. అందుకే పక్కాగా ఏపీ బీజేపీ టీంను ఏర్పాటు చేసుకుని… ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.

పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించే వారికే కీలక పదవులు

ఏపీ బీజేపీలో ఉన్న కీలక నేతల్లో చాలా ఫుల్ టైమర్స్ చాలా తక్కువ మంది. ఇతర వ్యాపారాలు.. వ్యాపకాలు పెట్టుకుని బీజేపీ అభివృద్ధి కోసం పని చేసేవారు తక్కువ. యువనేతల్లో విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి వారు పార్టీ కోసం విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు. రోజంతా వారు బీజేపీ కోసమే సమయం కేటాయిస్తారు. అవకాశం వస్తే అలా ఇతర వ్యాపకాలేమీ పెట్టుకోకుండా బీజేపీ కోసం పని చేసే యువనేతల్ని టీమ్‌లో కీలక బాధ్యతలు ఇవ్వాలని పురందేశ్వరి ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పురందేశ్వరి కసరత్తు చేశారని అంటున్నారు.

యువనేతలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం

ఏబీవీపీ అంటే విద్యార్థి రాజకీయాల నుంచి బీజేపీ సిద్దాంతాలతో… పార్టీలో ఎదుగుతున్న యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ కూడా రాష్ట్ర నాయకత్వాలకు సూచిస్తోంది. వారసత్వం..తో పాటు పార్టీ అధికారంలో ఉందని పార్టీలోకి వచ్చే వారి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. .. పార్టీ అధికారంలో ఉందా లేదా అని చూడకుండా… నిరంతరం పార్టీ కోసం శ్రమించే వారి కోసమే ప్రాధాన్యమివ్వాలనేది బీజేపీ పెద్దల అభిప్రాయం. ఈ ప్రకారం… విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, కోలా ఆనంద్ వంటి యువ నేతలకు ఈ సారి ఇంకా ప్రాధాన్యత లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు చేపట్టిన ప్రతీ కార్యక్రమంలోనూ వీరంతా తమదైన ముద్ర వేశారు.

దీర్ఖ కాలిక లక్ష్యాలను అమలు చేయబోతున్న కొత్త అధ్యక్షురాలు

బీజేపీని ఒకే సారి అధికారికానికి చేర్చాలనే ఆరాటం కాకుండా కింది స్థాయి నుంచి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ రావాలనుకుంటున్నారు. ఇందు కోసం దీర్ఘ కాలిక లక్ష్యాలను అమలు చేయబోతున్నారని అంటున్నారు. బీజేపీ హైకమాండ్ కూడా.. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేకమైన్ వ్యూహాలను ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.