హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత మరో పార్టీ విజయం సాధించలేదు. అక్కడ ఎలాగైనా గెలవాలని అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. కానీ ప్రతీ సారి వారి తప్పిదాల వల్ల టీడీపీకి విజయం లభిస్తోంది. ఈ సారి కూడా అలాంటి ప్రయోగమే చేయడంతో.. వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారుతోంది.
కొత్తగా దీపికారెడ్డిని ఇంచార్జ్ గా నియమించిన వైసీపీ హైకమాండ్
హిందూపురం నియోజకవర్గంలో నవీన్ నిశ్చర్, ఇక్బాల్ ప్రధాన నేతలుగా ఉన్నారు. అయితే వీరిద్దరకీ సరిపడదు. ఆధిపత్య పోరాటంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది . దీంతో హైకమాండ్ కొత్తగా ఆలోచించి వీరిద్దరూ కాకుండా దీపికారెడ్డి అనే నేతను నియమించారు. ఆమె అందర్నీ కలుపుకుని వెళ్లకుండా సొంత వర్గం రాజకీయాలు ప్రారంభించడంతో హిందూపురంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దానికి తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలే వేదికగా నిలిచాయి.
మున్సిపల్ చైర్మన్ ను అవమానించిన ఇంచార్జ్ దీపికా !
ఆగస్టు 15వ తేదీన వైసీపీకే చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ జెండా ఎగర వేయాడానికి కార్యాలయానికి వచ్చి సుమారు గంటకు పైగా వేచి చూశారు. అధికారులు అప్పటి రాక పోవడంతో ఫోన్ చేసి రావాలని పిలిచినా ఎవరు పలక పోగ, కనీసం ఒక చైర్‌పర్సన్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. దీంతో అమె కార్యాలయం నుంచి అవమాన భారంతో వెళ్లి పోయారు. చైర్పర్సన్ వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు. వెనువెంటనే జెండా ఆవిష్కరణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీ ఇన్చార్జ్ దీపిక తన వర్గ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని వైస్ చైర్మన్‌తో సహా కొంత మంది కౌన్సిలర్లు ఇన్చార్జి దీపిక తో జెండాను ఎగర వేయించారు. దీంతో వైసీపీలోనే కలకలం ప్రారంభమయింది.
బీసీ నేతను అవమానించారని ఆరోపణలు
దీపికా రెడ్డిగా ప్రచారంలో ఉన్నప్పటికీ వైసీపీ ఇంచార్జ్ బీసీ వర్గానికి చెందిన వారు. ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. అందుకే దీపికారెడ్డి అని పిలుస్తారు. అయితే మున్సిపల్ చైర్మన్ ఇంద్ర కూడా బీసీ వర్గాలనికి చెందిన వారే. బీసీ వర్గానికి చెందిన చైర్‌పర్సన్‌ను పక్కన పెట్టి, ఎలాంటి అధికారం లేని పార్టీ సమన్వయ కర్తను ముందుకు తెచ్చి జెండాను ఎగుర వేయించడం అవమానించడమేనని వాదిస్తున్నారు. మొత్తంగా వైసీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ఈ పరిణామాలు హిందూపురం వైసీపీని మరింత దిగజారుస్తున్నాయి కానీ మెరుగుపర్చడం లేదంటున్నారు.