అటల్ బిహారీ వాజ్‌పేయి నవ భారత నిర్మాణానికి బాటలు వేసిన నాయకుడు. విశాల భారతానికి 1998 నుంచి 2004 వరకు ప్రధానిగా సేవలందించారు. ప్రతిపక్షాలు సైతం ఆయన పనితీరును ప్రశంసించకుండా ఉండలేవు. అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపిన మహా నాయకుడు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాకుండా ప్రజల అవసరాలు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునేవారు. అందుకే పార్టీలకతీతంగా ఎందరో నాయకులు ఆయనను అభిమానించే వారు. రాజకీయాల్లో అజాత శతృవుగా, ప్రతిభావంతుడిగా, గొప్ప నాయకుడిగా వాజ్‌పేయి కీర్తి గడించారు.
మౌలిక సదుపాయాల రంగంలో భారత్ వెలుగులు.. వాజ్ పేయి వల్లే !
వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో స్వర్ణ చతుర్భుజీ అనే ప్రాజెక్టును చేపట్టారు. దేశంలో జాతీయ రహదారులు అద్దాల్లా మెరిసిపోవడానికి అభివృద్దికి ఆ ప్రాజెక్టు దోహదం చేసింది. అది విజయవంతం కావడంతో కేంద్రం తాజాగా భరత మాల చేపట్టింది. ఒక్క రోడ్లే కాదు… దేశంలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అప్పుడే బీజం పడింది. అందుకే నవ భారత నిర్మాతగా ఆయనకు పేరు వచ్చింది.
ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ వాజ్‌పేయి హయాంలోనే !
1998లో వాజ్‌పేయి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అణ్వస్త్ర పరీక్షలపై దృష్టి సారించారు. దీనికి ‘ఆపరేషన్ శక్తి’ అని నామకరణం చేశారు. గోప్యంగా అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచం వెన్నులో వణుకు పుట్టించారు. దీంతో భారత్ అణుపరీక్షల నిర్వాహణపై అమెరికా ఆంక్షలు విధించింది. అందుకు దీటుగా భారత్ కూడా స్పందించింది. అణ్వస్త్ర శక్తిగా భారత్ ఎదిగినప్పటికీ ఏ దేశంపైనా ముందుగా దాడిచేయదని వాజ్‌పేయి వెల్లడించారు. అదే సమయంలో సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దాయాది పాక్‌కు స్నేహ హస్తాన్ని సైతం అందించారు. ఇందులో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య తొలిసారి బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఈ తొలి బస్సులోనే ప్రధాని హోదాలో వాజ్‌పేయి పాక్‌లోని లాహోర్ వెళ్లి అక్కడ ఉన్న మినార్-ఇ-పాకిస్థాన్‌ను సందర్శించారు. అనంతరం పాకిస్థాన్ సార్వభౌమాధికారంతో సుసంపన్నమైన దేశంగా ఎదగాలని అక్కడి విజిటర్స్ బుక్‌లో రాశారు.
దేశం కోసం అలుపెరుగని యుద్ధం
ఆపరేషన్ విజయ్.. వాజ్‌పేయిని దేశ రాజకీయ చరిత్రలో బలమైన నేతగా నిలబెట్టింది. కార్గిల్ దురాక్రమణకు ప్రయత్నించిన పాక్ దళాలను భారత సైన్యం తిప్పికొట్టింది. అప్పట్లో దాయాదుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజేతగా నిలిచింది. నైతికంగా కూడా విజయం తమదే అని చాటేందుకు వాజ్‌పేయి తన నేర్పరితనంతో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌కు మద్దతిచ్చేలా చేశారు. ఐరాస నుండి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సమన్లు పంపేలా చేశారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ పాక్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేలా వాజ్‌పేయి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. భారత్ సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ పోరాటంతో 1999, మే 3న పాక్ దళాలు వెనక్కి పారిపోయాయి.
విలువలకు పట్టం
రాజకీయ విలువలను పాటించడంలో ఆయన అత్యున్నతమైన వ్యక్తి . ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా తొణకని నేత. అలాంటి నేత వర్థంతి నేడు. ఈ సందర్భంగా దేశం ఆ మహానేతను స్మరించుకుంటోంది.