నెల్లూరు రాజకీయం వైసీపీ అధినేతకు తలనొప్పిగా మారింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా వెళ్లిపోయారు. జిల్లాలు దాటి వెళ్లినా అనిల్ నెల్లూరు సిటీలో చక్రం తిప్పుతూ వేమిరెడ్డిపై పంతం నెగ్గించుకోగలిగారు. సిటీ టికెట్ తనవారికే ఇప్పించుకుని వేమిరెడ్డి వర్గానికి షాక్ ఇచ్చారు. దీంతో వేమిరెడ్డి అలిగారని.. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనని చెబుతున్నారని అంటున్నారు.
నెల్లూరులో వైసీపీ నేతల ఆధిపత్య ప ోరాటం
టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు పార్టీ గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇంకొందరు వేరే దారి కనపడక.. పార్టీలోనే ఉంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే నెల్లూరు సిటీ సెగ్మెంట్లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటుతో అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ.. ఆ పార్టీ అభ్యర్ధులందరి విజయానికి అన్నివిధాలా అండగా నిలిచారు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్‌యాదవ్ విజయానికి ఎంతో సహకరించారు. అయితే అనిల్ మంత్రి అయ్యాక వారిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడి.. అది క్రమంగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డిని నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని వైసీపీ నిర్ణయించింది.
అనిల్ యాదవ్ పై వేమిరెడ్డి అధిపత్యపోరాటం
ఎంపీ బరిలో దిగాలంటే మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో అభ్యర్ధులను మార్చాలని పట్టబట్టిన వేమిరెడ్డి.. నెల్లూరు సిటీ సెగ్మెంట్‌లో సక్సెస్ అయ్యారు. ఆ ఎఫెక్ట్‌తో సిటీ ఎమ్మెల్యే అనిల్ నరసరావుపేట షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సిటీ ఎమ్మెల్యే ప్రమోషన్ పేరుతో నరసరావుపేట ఎంపీ కేండెట్ అయ్యారు. నెల్లూరు సిటీ నుంచి వేమిరెడ్డి సూచించిన అభ్యర్ధే పోటీలో ఉంటారని అందరూ భావించారు. దానికి తగ్గట్లే అక్కడ పోటీకి తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మదీనా వాచ్ కంపెనీ ఓనర్ ఇంతియాజ్ పేర్లు సూచించారాయన.. అయితే ఆ ప్రతిపాదనలు పక్కన పడేసిన వైసీపీ పెద్దలు.. ఎవరూ ఊహించని విధంగా నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు. ఖలీల్ అహ్మద్ అభ్యర్ధిత్వం కోసం తెరవెనుక తతంగం నడిపించి అనీలేనంట. ప్రకటించిన అభ్యర్థి ఎమ్మెల్యే అనిల్ కుమార్ సూచించిన వ్యక్తి కావడం.. జిల్లా వైసీపీ శ్రేణులకు పెద్ద షాకే ఇచ్చింది. వాస్తవానికి జిల్లా పార్టీకి పెద్ద దిక్కు కనుక వచ్చే ఎన్నికల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించిన వ్యక్తికే టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది.
భార్యకు టిక్కెట్ ఇవ్వలేదని అలిగిన వేమిరెడ్ిడ
తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కి టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రతిపాదన పక్కన పెడతారని ఎవరు ఊహించలేదు. నెల్లూరు సిటీ సీటు తాను సూచించిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి.. ఖలీల్ అహ్మద్ విషయం జాబితా ప్రకటించడానికి అరగంట ముందు చెప్పిందంట వైసీపీ. అలా అనిల్ పంతం నెగ్గించుకోవడంపై.. వేమిరెడ్డి రియాక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. తన మాట చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు టచ్‌లో లేకుండా వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సమేతంగా చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దలు కాంటాక్ట్ చేద్దామంటే.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారంట. ఎన్నికల ముందు వేమిరెడ్డి అలా అలకపాన్పు ఎక్కడంతో జిల్లా వైసీపీ నేతల్లో లేనిపోని భయాందోళనలు కనిపిస్తున్నాయి.