నెల్లూరు వైసీపీలో ఏర్పడిన సంక్షోభంలో మరో అంకం ప్రారంభమయింది . వైసీపీ అధినేత వ్యతిరేకత మూటగట్టుకున్న కొంత మందికి నమస్కారం పెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అనిల్ కుమార్ యాదవ్. మంత్రిగా మూడేళ్లు ఉండి మొత్తం నెల్లూరు జిల్లా వైసీపీని చిందరవందర చేశారన్న ఆగ్రహం ఆయనపై జగన్ లో ఉందని చెబుతున్నారు. అదే సమయంలో గడప గపడకూ మన ప్రభుత్వం కార్యక్రమం కూడా నిర్వహించడం లేదు. తనకు టిక్కెట్ ఇవ్వరని తెలుస్తూ ఉండటంతో జగన్ ను ఇంప్రెస్ చేసేందుకు అనిల్ కుమార్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
జగన్ ను పొగడటం ఇతర పార్టీల్ని తిట్టడం !
జగన్ ను ఇంప్రెస్ చేసేందుకు అనిల్ యాదవ్ బీభత్సమైన ప్రకటనలు ఇస్తున్నారు. తన గుండె కోస్తే జగన్ ఉంటారంటున్నారు. ఆయన మెడ పట్టుకుని గెంటేసినా తాను వైసీపీ నుంచి పోనంటున్నారు. కానీ అది ..తనను గుర్తించమని చేస్తున్న విన్యాసం. తాను ఇతర పార్టీలతో టచ్ లో లేనని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతల్ని కూడా విమర్శల స్థాయి దాటి తిడుతున్నారు. అవన్నీ జగన్ మోహన్ రెడ్డికి చేరుతున్నాయో లేదో కానీ అనిల్ కుమార్ కు మాత్రం… తాడేపల్లి నుంచి పాజిటివ్ సంకేతాలు అందడం లేదు.
అనిల్ కు పోటీగా బాబాయ్ రూప్ కుమార్
మంత్రి పదవి పోయిన తర్వాత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. సొంత బాబాయే తిరుగుబాటు చేయడంతో పాటు ఆయనకు టిక్కెట్ లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తన నీడన రాజకీయాలు చేయాల్సన బాబాయ్ రూప్ కుమార్ తన టిక్కెట్ కే ఎసరు పెడుతున్నట్లుగా కనిపించడంతో అనిల్ కుమార్ రగిలిపోతున్నారు. సీఎం జగన్ ఇద్దరూ కలిసి పని చేయాలని సూచించారు. అయితే అదే అడ్వాంటేజ్ అన్నట్లుగా రూప్ కుమార్ చెలరేగిపోతున్నారు. తాజాగా సొంత ఆఫీసు పెట్టుకుని దానికి జగన్ పేరు పెట్టేసారు. ఎమ్మెల్యే అనిల్ ఆఫీస్ పేరు రాజన్న భవన్ అయితే, రెండో పవర్ సెంటర్ పేరు జగనన్న భవన్. అనిల్ వ్యతిరేక వర్గమంతా ఇక్కడకు చేరుకుంది. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి జగనన్న భవన్ రూప్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి అనిల్ వ్యతిరేక వర్గం హాజరైంది. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సహా ఇతర నాయకులు రూప్ కుమార్ వెంట నడిచారు.
అనిల్ కుమార్ కు తగ్గిపోయిన బలగం !
అనిల్ కుమార్ అనుచరుల్లో సగం మందికిపైగా రూప్ కుమార్ వెంటనే వెల్లారు. నెల్లూరు సిటీలో అనిల్ కి టికెట్ దక్కనీయకుండా రూప్ కుమార్ పావులు కదుపుతున్నారు. రూప్ కుమార్ కి సిటీలో మంచి పట్టు ఉంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ఆయన నేరుగా ఎమ్మెల్యే టికెట్ ఆశించకపోయినా.. అనిల్ కి రాకుండా చేస్తే సగం విజయం సాధించినట్టే అనుకుంటున్నారు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పార్టీపట్ల విధేయత ప్రదర్శిస్తూనే అనిల్ కి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారు. రూప్ కుమార్ కు అండగా సీఎం జగన్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అనిల్ కుమార్ ను పక్కన పెట్టేయడానికి రూప్ కుమార్ ని ప్రొత్సహిస్తున్నారని చెబుతున్నారు.
జగన్ కనికరించకపోతే జనసేనలోకి అనిల్ కుమార్
అనిల్ కుమార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని. అయితే రాజకీయం వంట బట్టించుకున్నారు. ఆయన పవన్ ను తిట్టారు. కానీ చాలా సార్లు పవన్ ను కలిశారన్న ప్రచారం ఉంది. రాజకీయంగా టిక్కెట్ రాకపోతే ఆయన బాబాయ్ కి సపోర్ట్ చేసే చాన్స్ లేదు. తన నియోజకవర్గంలో ఇతరులకు చాన్సిచ్చినా ఊరుకోరు. ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తారు. అందుకే బీజేపీ మద్దతు ఉండే జనసేన వైపు చూస్తారని అంటున్నారు.