దేశంలో అప్పుడే ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఏడెనిమిది నెలల ముందే లోక్ సభ ఎన్నికలకు పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ సారి పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికార బీజేపీ వ్యూహరచనలో ఉంది. ఆ దిశగా మిత్రపక్షాలను కలుపుకుపోయే పనిలో బిజీగానూ ఉంది. ఇటీవల జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశం గ్రాండ్ సక్సెస్ కావడం మరింత కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని భాగస్వామ్య పక్షాలు ఆమోదించడంతో పాటు ఆయనతోనే భారత జాతి సమగ్రాభివృద్ధి సాధ్యమని గుర్తుంచడం బీజేపీకి సంతృప్తినిస్తోంది. వేర్వేరు కారణాలతో ఎన్డీయేకు దూరమైన పార్టీలు కూడా మళ్లీ వచ్చి చేరడంతో మోదీ నాయకత్వానికి తిరుగులేదని నిరూపించినట్లయ్యింది.
త్వరలో ఎన్డీయే ఎంపీలతో భేటీలు
ఎన్డీయే ఎంపీలతో మోదీ స్వయంగా భేటీలు నిర్వహించి వారిని ఉత్తేజ పరచాలని తీర్మానించుకున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పెద్దల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు వరుస భేటీలు ఉంటాయని విశ్వసనీయ సమాచారం. దీని కోసం ఇప్పటికే ఎన్డీయే ఎంపీలను పది గ్రూపులుగా విభజించారు. ఎవరెవరు ఏ గ్రూపులో ఉన్నారో త్వరలో వారికి తెలియజెప్పే అవకాశం ఉంది. అయితే ప్రాంతాల వారీగా ఈ గ్రూపులున్నాయని ప్రచారం జరుగుతోంది. అన్ని గ్రూపులకు మోదీ నాయకత్వం వహిస్తారు.
తొలుత ఉత్తరాది ఎంపీల భేటీ
బీజేపీకి తిరుగులేని మెజార్టీ సాధించి పెట్టిన ఉత్తరాది రాష్ట్రాల ఎంపీల సమావేశం తొలుత నిర్వహించే వీలుందని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా ఎంపీలతో సమావేశాలు నిర్వహించిన తర్వాతే ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని మోదీ ఆదేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల పనులు ఎలా చేయాలి, జనంలో ఎన్డీయే ఇమేజ్ ను మరింతగా పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై మోదీ దిశానిర్దేశం చేస్తారు. ఆయా రాష్ట్రాల భవన్లలోనే సమావేశాలు జరుగుతాయి. ఉదాహరణకు మహారాష్ట్ర ఎంపీల భేటీ ఢిల్లీలోని మహారాష్ట్ర భవన్లోనే జరుగుతుంది. యూపీ ఎంపీల భేటీ కూడా ఉత్తర ప్రదేశ్ భవన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీయే నేతలను సమన్వయ పరుచుకునే బాధ్యతను నడ్డా, నితిన్ గడ్కరీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి నేతలకు అప్పగించారు. ఎన్డీయే కార్యక్రమాలను రూపొందించే బాధ్యత సర్బానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్, తరుణ్ చుగ్, రితురాజ్ కు అప్పగించారు. వారిని సహాయపడే మరికొందరు ఎంపీల పేర్లు కూడా త్వరలో ప్రకటిస్తారు.
ఆ 160 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
ఎన్డీయే కాస్త బలహీనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న 160 నియోజకవర్గాలపై ఏకాగ్రత చూపాలని పార్టీ శ్రేణులను మోదీ ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. బూత్ మేనేజ్ మెంట్ కూడా వారి పరిధిలోకే వస్తోంది. పోలింగ్ బూత్ స్థాయిలో ఇప్పటికే పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి నేతలను కలుపుకుపోతూ పార్టీని పటిష్టం చేయాల్సి ఉంటుంది. ఎన్డీయే భాగస్వాములతో కలిసి 50 శాతం ఓట్ షేర్ సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…