ఏపీ రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్. ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని మరోసారి స్పష్టంచేశారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్ ఐ ప్యాక్ టీమ్‌తో భేటీ అయ్యారు. గతం కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పడాన్ని తన ఇంటర్వ్యూలో ప్రధానంగా ప్రస్తావించారు ప్రశాంత్ కిషోర్. ఈసారి ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని అంచనా వేశారు. పదేళ్లగా ఎన్నికల క్షేత్రంలో పని చేస్తున్నామని, ఎక్కడ ఏ విధంగా జరుగుతుందో ముందే తెలుసన్నారు. ఫలితాలకు ముందు ఓటమిని అంగీకరించిన నేతలు ఇప్పటివరకు ఎవరూ కనపించలేదని గుర్తు చేశారు. ఓట్ల లెక్కింపు రోజు నాలుగైదు రౌండ్లు తర్వాత మీకే తెలుస్తుందన్నారు.
కూటమి వైపు ప్రజల మొగ్గు
గడిచిన ఐదేళ్లలో అధికారంలోఉన్న జగన్ పార్టీ చాలా తప్పులు చేసిందన్నారు ప్రశాంత్‌కిషోర్. ముఖ్యంగా ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల.. ఇద్దరూ ఈసారి వ్యతిరేకంగా పని చేశారన్నారు. 2019లో జగన్ కు మద్దతు ఇవ్వడమేకాదు, తనదైన శైలిలో ప్రచారంలో ప్రచారం చేశారని వివరించారు. ఏపీలో ఎన్నికలకు ముందు తెలుగులోని ఓ డిజిటల్ మీడియా నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్నారు ప్రశాంత్‌కిషోర్. అప్పుడు కూడా ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని, ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే మాట చెప్పారు. మూడు రాజధానుల ఆలోచన తనది కాదని గుర్తు చేశారు కూడా. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని గెలిచిన ప్రభుత్వాలు ఇప్పటివరకు లేవని, అదే టైమ్‌లో అభివృద్ధి కూడా జరగాలన్నారు. ముఖ్యంగా కొత్త ఓటర్లు ఈసారి కూటమి వైపు మొగ్గుచూపారని అంటున్నారు.
మహిళా ఓట్లపై వైసీపీ ఆశ
ఈసారి ఏపీలో పురుషులు కంటే మహిళా ఓటర్లు ఎక్కువ. కోటి 69 లక్షల మంది మహిళలు కాగా, పురుషులు కేవలం కోటి 64 లక్షలు మంది. అంటే ఈసారి మహిళ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. లబ్దిపొందిన మహిళలకు తమకు ఓటు వేశారని, అందుకే ఉదయం నుంచి క్యూలో ఉంటున్నారని సీఎం జగన్ అంచనా. అందులో 70శాతం తమకు పడినా విజయం తమదేనన్నది ఆ పార్టీ లెక్క. మహిళలంతా తమవైపు ఉన్నారని పైకి బలంగా చెబుతున్నారు నేతలు. కాకపోతే వైసీపీ ప్రభుత్వం హయాంలో లబ్దిపొందిన మహిళలు కేవలం 65 లక్షలు మాత్రమే ఇంకా 95 లక్షలు మహిళలు మాటేంటని సైకిల్ పార్టీ నుంచి బలంగా కౌంటర్లు పడిపోతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం చేసిన సూపర్ సిక్స్ పథకాలు వైసీపీకి బాగా దెబ్బ కొట్టడం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.
పరిస్థితి మారిందంటున్న ప్రశాంత ్కిషోర్
2014, 2019 ఎన్నికల్లో వైసీపీ దాదాపు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను అధికంగా గెలుచుకుంది. టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఈసారి అక్కడే ఓటర్లు రివర్స్ అయినట్టు చెబుతున్నారు. సగానికి పైగానే ఆయా నియోజకవర్గాలను టీడీపీ గెలవనుందని ఓ అంచనా. పోలింగ్ పెరిగిన ప్రతీసారి అధికార పార్టీ ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారీ అదే రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెబుతున్నారు.