స్త్రీ శక్తిని స్మరిస్తూ సాగే నవరాత్రులు – విజయదశమి వైభవం!

శరత్కాలంలో వచ్చే తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అని పిలుస్తారు. హిందువులకు ఎన్నో పండుగలు, ఎందరో దేవతలున్నా స్త్రీ శక్తిని స్మరిస్తూ సాగే నవరాత్రులు..ఆ నవరాత్రుల తర్వాత విజయదశమి వైభవం మాటల్లో వర్ణించలేనిది.

మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు ఆపకుండా యుద్ధం చేసిన జగజ్జనని దుర్గాదేవి తొమ్మిదవ రోజైన మహర్నవమి నాడు మహిషాసురుడిని వధించి లోకానికి విముక్తి కలిగించిందని. ఆ విజయాన్ని సంబరంగా పండుగగా పదో రోజు జరుపుకుంటారు. అదే విజయదశమిగా పిలుస్తారు. మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ట చేసి నవరాత్రులు మొత్తం ఒకో రోజు ఒకో విధంగా అమ్మవారిని అలంకరించి, నైవేద్యాలు, పూజలు నిర్వహించి పదో రోజు పూజలు ముగిసిన తరువాత అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తారు.

కొన్ని ప్రాంతాల్లో మరో కథ కూడా ప్రచారంలో ఉంది. సీతను అపహరించిన రావణాసురుడి జాడ కనుక్కుని లంకలో రావణుడితో జరిపిన యుద్ధంలో రాముడు రావణాసురుడిని శరత్కాలంలోని ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు వధించాడని…ఆ విజయానికి గుర్తుగా విజయదశమిని వేడుకగా చేసుకుంటారని చెబుతారు. కేవలం కథనమే కాదు విజయదశమి రోజున ఎన్నో ప్రాంతాలలో రావణుడి దిష్టిబొమ్మను తయారుచేసి విజయదశమి రోజు సూర్యాస్తమయం అయిన వెంటనే ధనస్సు బాణానికి అగ్ని వెలిగించి ఆ బాణాన్ని విడవడం ద్వారా రావణ దహనం చేస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా విజయదశమిని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు.

సాయంకాలం ప్రధానం
ఉదయం పూజ, పండుగ ఒక ఎత్తైతే సాయంకాలం సందడి మరింత పెరుగుతుంది. సొంతం వాహనాలు ఉన్నవారు తమతమ వాహనాలను శుభ్రం చేసి, పువ్వులతో, రంగురంగుల కాగితాలతో, కుంకుమ బొట్లతో ఎంతో అందంగా అలంకరించి, వాహనాలకు నిమ్మకాయ హారాలు వేసి, ఊరంతా తిప్పుతారు. మరోవైపు ప్రతి ఊరిలో ఉన్న గుడులు, ముఖ్యంగా అమ్మవారి గుడులలో సందడి అంబరాన్ని అంటుతుంది. కుటుంబసమేతంగా జమ్మిచెట్టును దర్శించుకుని పూజలు చేసి, జమ్మి చెట్టు ఆకులు తీసుకుని, వాటిని పెద్దలకు ఇచ్చి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇలా దసరా పండుగ ముగుస్తుంది.