నెయిల్ పాలిష్ వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పొడవైన గోళ్లను షేప్ చేసి వాటికి రంగురంగుల రంగులేస్తే ఆ అందమే వేరు. లేడీస్ ఉండే ప్రతి ఇంట్లోనూ నెయిల్ పాలిష్ లేకుండా ఉండదు. వారానికోసారి పాతది తీసేయడం కొత్తది వేసుకోవడం ఇదే పని. కొందరైతే రోజుకో రంగు మారుస్తుంటారు. అయితే నెయిల్ పాలిష్ వల్ల ప్రాణాంతక అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా.
చేతులకు ముప్పు తెచ్చుకున్న మహిళ
ఓ మహిళ ఎప్పటినుంచో నెయిల్ పాలిష్ ను వేసుకోవడం అలవాటుగా మార్చుకుంది. ఒకసారి ఆమెకు గోళ్లు విపరీతంగా నొప్పి పెట్టాయి. వేళ్ళ దగ్గర చర్మం ఊడిపోయి వేళ్లు కదల్చలేని పరిస్థితి వచ్చింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని భావించిన వైద్యులు యాంటీబయోటిక్స్ తో చికిత్స అందించారు. నయమైన తర్వాత మళ్లీ పాలిష్ వేసుకుంది. తిరిగి అవే లక్షణాలు కనిపించాయి. అప్పటికి కానీ అర్థంకాలేదు అంతా నెయిల్ పాలిష్ వల్లే. గోళ్లు ఊదా రంగులోకి మారిపోయి పెళుసుగా అయ్యాయి, విపరీతంగా దురద, నొప్పితో పాటూ ఆ లక్షణాలు చేతులకూ సోకాయి. జెల్ నెయిల్ పాలిష్ లోని రసాయనాలు చర్మం లోకి ప్రవేశించడం వల్లే ఎలర్జీ అని గుర్తించారు. జీవితాంతం నెయిల్ పాలిష్ వేసుకోవద్దని హెచ్చరించారు.
నెయిల్ పాలిష్ పాలిష్ లో ప్రమాదకర రసాయనాలు
నెయిల్ పాలిష్లలో మెథాక్రిలేట్స్ అనే ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మం లోకి ప్రవేశించి చెడు ఎలర్జీలకు కారణం అవుతాయి. వీటివల్ల గోళ్లు పెళుసుగా మారి, విరిగిపోతాయి. దీర్ఘకాలంగా నొప్పి ఉంటుంది. ఆ రసాయనం లేని నెయిల్ పాలిష్ ఏదో తెలుసుకోవడం కూడా కష్టమే. అందుకే నెయిల్ పాలిష్ వేసుకున్నాక ఏమాత్రం రియాక్షన్ కనిపించినా వాటిని దూరం పెట్టేయాలి. లేకుంటే అది చేతి వేళ్లు కోల్పోయే పరిస్థితికి తీసుకురావచ్చు. నెయిల్ పాలిష్ వేసుకునే ముందు గోళ్లకు SPF30 అనే సన్‌స్క్రీన్ లోషన్ రాసి ఆ తరువాత నెయిల్ పాలిష్ వేసుకోవడం ఉత్తమం.
నెయిల్ పాలిష్ లో ట్రైఫెనెల్ ఫాస్పేట్ రసాయనం
నెయిల్ పాలిష్ లో ఉండే మరో రసాయనం ట్రైఫెనెల్ ఫాస్పేట్ . ఇది శరీరంలో చేరితే నేరుగా హార్మోన్లపైనే ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడో ఒకసారి నెయిల్ పాలిస్ వేసుకుంటే పర్వాలేదు కానీ నిత్యం వేసుకునే వారిపై మాత్రం ప్రభావం తప్పదు. కొందరు కుడి చేతికి కూడా వేసుకుంటారు..అన్నం తినేటప్పుడు పొట్టలోకి చేరి మరింత ప్రమాదం. మార్కెట్లో దొరికే 3వేల రకాల నెయిల్ పాలిష్‌లపై జరిగిన పరిశోధనల్లో 49శాతం నెయిల్‌పాలిష్‌లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉంటుందని తేల్చారు. ఇలాంటి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, వీటిని పెట్టుకున్న 10-14గంటల్లోపే మనలో టీపీహెచ్‌పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మిగతా కణాలు కూడా రోగ నిరోధకతను కోల్పోవడంతో పాటు డీఎన్ఏ ధ్వంసమవుతుందని, ఇది స్కిన్ క్యాన్సర్‌కు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…