మణిపూర్ ఘర్షణల్లో మియన్మార్ కోణం

రెండు జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో రోజూ ఏదో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. ప్రభుత్వానికి ఉన్న తలనొప్పి చాలక కొత్త సమస్యతో తలబొప్పి కడుతోంది. మే 3న ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించినంత వరకు అనేక హృదయ విదారక దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచే పరిస్థితిని సృష్టిస్తున్నాయి. తాజా మియన్మార్ జాతీయుల వివాదంతో మణిపూర్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రెండు రోజుల్లో 718 మంది రాక..

ఇటీవలి కాలంలో మియన్మార్ జాతీయుల రాక పెరిగింది. ఈ నెల 22, 23 తేదీల్లో 718 మంది మియన్మార్ జనం సరిహద్దు దాటి మణిపూర్ లోకి వచ్చేశారు. 209 మంది పురుషులు, 208 మంది మహిళలు, 301 మంది పిల్లలు బోర్డర్ దాటి వచ్చేశారు. పైగా వారి వద్ద భారీ స్థాయిలో మారణాయుధాలున్నట్లు కూడా గుర్తించారు. వారిని మనదేశంలోకి ఎందుకు రానిచ్చారంటూ మణిపూర్ ప్రభుత్వం ఆసోం రైఫిల్స్ భద్రతా విభాగాన్ని వివరణ కోరింది. వారి వద్ద పాస్ పోర్టు, వీసా లాంటి ఎలాంటి ప్రయాణ పత్రాలు లేవని రాష్ట్రప్రభుత్వం గుర్తించింది.

చందేల్ జిల్లాలోంచి రాక…

మియన్మార్ జాతీయులు చందేల్ జిల్లా గుండా దేశంలోకి వస్తున్నారని సరిహద్దు భద్రతను చూస్తున్న అసోం రైఫిల్స్ కు మణిపూర్ ప్రభుత్వం అనేక పర్యాయాలు సమాచారం అందించింది. అక్రమ వలసలు ఆపకపోతే అది అంతర్జాతీయ సమస్యగా పరిణమిస్తుందని కూడా హెచ్చరించింది. ఇప్పుటికే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయని మే 3 తర్వాత కఠినంగా ఉండాల్సిన అసోం రైఫిల్స్ అధికారులు ప్రేక్షకపాత్ర పోషించినందునే ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. అంత మందిని ఎందుకు అనుమతించారో వివరణ ఇవ్వాలంటూ అధికారిక వర్తమానం పంపింది. ప్రతీ మియన్మార్ జాతీయుడి బయోమెట్రిక్స్, ఫోటోలను తమకు అందించాలని కోరింది.

ఆరువేలకు పైగా జీరో ఎఫ్ఐఆర్స్

హింసకు సంబంధించి మణిపూర్లో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే.. ఆ కేసులన్నీ సంబంధిత పోలీస్ స్టేషన్లో రిజిస్టరైనవి కాదు. నేరం ఒక చోట జరిగితే.. మరో ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదైన కేసులవి..! ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరువేలకు పైగా జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ ఎఫ్‌ఐఆర్‌లను సంబంధిత ఠాణాలకు బదిలీ చేయడం ఒక టాస్క్‌ అయితే.. ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులు దర్యాప్తును ప్రారంభించడం మరో పెద్ద సమస్య. ఇందుక్కారణం, ఈ అల్లర్లలో బాధితులైన కుకీలు.. తమ వర్గం పోలీసుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఠాణాలోనే ఫిర్యాదులు చేస్తున్నారు. మైతేయీ వర్గం బాధితులు కూడా అదే పంథాలో నడుస్తున్నారు. నగ్నంగా ఊరేగించిన సంఘటనకు సంబంధించి కూడా కుకీ మహిళలు తమ వారి ప్రాబల్యం ఎక్కువ ఉన్న పోలీస్ స్టేషన్లో జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మణిపూర్‌ అల్లర్లు ప్రారంభమైన తొలినాళ్లలో 50 వేల మంది దాకా మైతేయీలు నిరాశ్రయులయ్యారు. వారు కూడా తమకు అనుకూలంగా ఉన్న ఠాణాల్లోనే జీరో ఎఫ్‌ఐఆర్‌లు చేయించారు. వేరే పోలీస్ స్ఠేషన్లకు వెళితే పట్టించుకోరన్న అనుమానంతో ఇలా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని బాధితులు చెబుతున్నారు. అల్లర్లు ఎక్కువగా జరిగిన ఒక్క చురాచాంద్‌పూర్‌ ఠాణాలోనే 1,700 జీరో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.