8 ఏళ్ల వయసులో మా నాన్న లైంగికంగా వేధించారు – ఖుష్బూ8 ఏళ్ల వయసులో మా నాన్న లైంగికంగా వేధించారు – ఖుష్బూ

చెన్నై : సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. గాయపరిచి, చిత్రహింసలకు గురి చేసేవారని చెప్పారు. అది తనకు అత్యంత క్లిష్ట సమయమని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్థాన్‌లోని జైపుర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక అబ్బాయి, అమ్మాయి చిన్నతనంలో వేధింపులకు గురైతే.. అది వాళ్లను జీవితాంతం భయానికి గురి చేస్తుంది. తన భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని జన్మ హక్కుగా భావించే వ్యక్తివల్ల నా తల్లి వైవాహిక బంధంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డాను. ఎందుకంటే.. ఏం జరిగినా తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం ఆమెది. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను. నాకు 16 ఏళ్లు రాక ముందే ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. ఆ సమయంలో మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం’ అని ఖుష్బూ వివరించారు.