రాజకీయాల్లో ఆయా రామా.. గయా రామ్ సంస్కృతి మామూలు విషయమే. ఉదయం ఒక పార్టీ, సాయంత్రం మరో పార్టీలో ఉండే వాళ్లని చాలా మందిని చూశాం. బెంగాల్ లో కూడా ఇప్పుడు అదే తరహా రాజకీయాలు జరుుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి బీజేపీలోకి మారి, మళ్లీ మమత పంచన చేరిన కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ ఇప్పుడు మరో సారి కాషాయ సేనలో భాగమవుతానని చెప్పుకుంటున్నారు. మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహిత రాజకీయ నాయకుడిగా ఉన్న ముకుల్ రాయ్.. ప్రస్తుతం వస్తూ పోతూ ఉండే నేతగా మారారు.
అనారోగ్యం, ఢిల్లీలో ప్రత్యక్షం
ముకుల్ రాయ్ అకస్మాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ పెద్దలను కలిసేందుకు వచ్చానని చెప్పుకున్నారు. పార్టీ వారు పిలిస్తేనే వచ్చానని, బసకు ఏర్పాట్లు కూడా వాళ్లే చేశారని వెల్లడించారు. గట్టిగా అడిగితే పర్సనల్ వర్క్ అని అంటున్నారు. తాను బీజేపీకి రాజీనామా చేయలేదని, క్రియాశీల సభ్యుడిగానే కొనసాగుతున్నానని చెప్పుకున్నారు. రాజకీయాల్లో ఉన్న తన కుమారుడు శుభారంగ్షు కూడా బీజేపీ వైపుకు వస్తే మంచిదని సలహా ఇచ్చారు.
ముకుల్ రాయ్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల తెలిపారు. ఇటీవలే ఆయనకు బ్రెయిన్ సర్జరీ కూడా జరిగింది. మతిమరుపు రోగం వచ్చేసింది. బాగా తెలిసిన వారికి కూడా గుర్తు పట్టలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం రాజకీయాలు మాట్లాడుతున్నారు.
కేసు నమోదు
రెండు రోజుల క్రితం ముకుల్ రాయ్ ఎక్కడికో వెళ్లిపోయినట్లు కుమారుడు శుభారంగ్షు తెలిపారు. ఎంత వెదికినా కనిపించలేదన్నారు. ఏయిర్ పోర్టులో ఉన్నాడని తెలుసుకుని స్పందించే లోపే విమానం బయలుదేరిందని వివరించారు. ఢిల్లీలో దిగి విలేకర్లతో మాట్లాడారు. కోల్ కతా ఎయిర్ పోర్టు పోలీసులకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ వెళ్లి ముకుల్ రాయ్ తో అసలు సంగతి తెలుసుకునేందుకు పోలీసు బృందం బయలుదేరింది..
మొదటి నుంచి బీజేపీ అభిమానేనట.
తొలుత తృణమూల్ లో ఉన్న ముకుల్ రాయ్.. తర్వాత పార్టీలో విభేదాల కారణంగా 2017లో బీజేపీలో చేరారు. 2020లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. నెల రోజులకే మళ్లీ తృణమూల్ వైపుకు వచ్చేశారు. బీజేపీలో అవమానాలను భరించలేకపోతున్నానని చెప్పుకున్నారు. అప్పటి నుంచి జనంలో కనిపించడం తగ్గేంచేశారు. అనారోగ్య కారణాలు చూపి పశ్చిమ బెంగాల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరతానంటున్నారు. బీజేపీ నాయకులు చీఫ్ పాలిటిక్స్ ఉపయోగించి తన తండ్రిని లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ముకుల్ రాయ్ కుమారుడు శుభారంగ్షు అంటున్నారు. మతిస్థిమితం లేని తన తండ్రిని కూడా వదిలిపెట్టడం లేదని ఆరోపిస్తున్నారు..
చేర్చుకునేది లేదంటున్న సువేందు
తాజా పరిణామాలపై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. ముకుల్ రాయ్ ని చేర్చుకునేది లేదని, పార్టీకి ఆయన అవసరం లేదని ప్రకటించేశారు. ముకుల్ రాయ్ పార్టీకి చేసిందేమీ లేదని, ఆయనో అదనపు లగేజీ అన్నట్లుగా మాట్లాడారు. మరి ముకుల్ రాయ్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు. బీజేపీలో చేరడం నిజమేనా…పూర్తి వివరాలు ఒకటి రెండు రోజుల్లో తెలుస్తాయి…