వైసీపీలోకి ముద్రగడ – పవన్ బలంపై దెబ్బ పడుతుందా ?

ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గంలో పేరున్న నేత. రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఆయన ఇప్పుడు వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబుపై తీవ్ర కోపం ఉన్న ముద్రగడ.. ఆయనతో కలిసిన పవన్ పైనా విరుచుకుపడుతున్నారు. వారు కలిసినా సరే ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

గెలుపు గుర్రాల వేటలో ముద్రగడను చేర్చుకుంటున్న సీఎం జగన్

ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ వైసీపీలో అనూహ్యమార్పులు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చటం, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీచేయించటం, అలాగే కొందరు ఎమ్మెల్యేల‌ను ఎంపీలుగా పోటీచేయించాలని అనుకుంటున్నారు. కొందరు సిట్టింగులకు అసలు టికెట్లే ఇవ్వకపోవటం కూడా ఇందులో భాగమే. చాలాకాలం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని అనుకుంటున్న ముద్రగడ అందుకు వైసీపీని వేదికగా చేసుకోబోతున్నట్లు సమాచారం. కాపు ఉద్యమనేతగా ముద్రగడ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు.

కాపుల్లో ముద్రగడకు ప్రత్యేక స్థానం

కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముద్రగడతో పాటు ఆయన కుటుంబం ఎన్ని అవమానాలకు గురయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటినుంచి చంద్రబాబు అంటేనే ముద్రగడ తీవ్రంగా మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే తొందరలోనే వైసీపీలో చేరాలని ముద్రగడ డిసైడ్ అయ్యారట. ముద్రగడే వైసీపీలో చేరాలని అనుకున్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డే పార్టీలో చేరమని ముద్రగడను ఆహ్వానించారని తెలుస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి రెండుసార్లు ముద్రగడతో భేటీ అయ్యారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. నిజం. అన్నీకలిసొచ్చి ఫైనల్ గా వైసీపీలో చేరాలని అనుకున్నారు.

పెద్దాపురం అసెంబ్లీ సీటు కన్ఫర్మ్ అయిందా ?

కాకినాడ ఎంపీగా గానీ పెద్దాపురం ఎమ్మెల్యేగా కానీ ముద్రగడ పోటీ చేసే చాన్స్ ఉంది. అయితే ముద్రగడ తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం చూస్తున్నారు. ఆయన కుమారుడు చల్లారావుకు పోటీ చేసే చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. చల్లారావు పోటీచేసే అవకాశముందని తెలుస్తోంది. ముద్రగడ కాంగ్రెస్, తర్వాత టీడీపీ ఆ తర్వాత కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ చివరకు ఇండిపెండెంటుగా కూడా పోటీచేశారు. గెలిచినా, ఓడినా, పదవిలో ఉన్నా లేకపోయినా ముద్రగడకు క్లీన్ ఇమేజ్ ఉంది.