ఎంపీ మాధవ్ ఇక రాజకీయ నిరుద్యోగేనా ? ఎక్కడా టిక్కెట్ గ్యారంటీ ఇవ్వని వైసీపీ హైకమాండ్ !

పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ రాజకీయ నిరుద్యోగిగా మారే పరిస్థితి వస్తోంది. ఆయనకు ఈ సారి హిందూపురం టిక్కెట్ ఇస్తారన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఎన్ని సార్లు కలిసినా వైసీపీ పెద్దలు ఏమీ చెప్పడం లేదు. ఆయనకు ఎంపీ కాకపోయినా కనీసం ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారన్న ఆశలు పెట్టుకున్నారు. అవి కూడా గల్లంతయ్యాయని అనంతపురం వైసీపీలో చర్చ జరుగుతోంది.

వివాదాలతో గోరంట్ల మాధవ్‌కు కష్టం

జేసీ బ్రదర్స్ పై మీసం మెలి తిప్పి వైసీపీ పెద్దల దృష్టిలో పడ్డారు గోరంట్ల మాధవ్. పోటీ చేసిన మొదటి సారే ఎంపీగా కూడా గెలిచారు. పోలీసు అధికారిగానున్న సమయంలోనూ ఆయన చుట్టూ అనేక వివాదాలున్నాయి. అయితే రాజకీయాల్లో అవి ప్లస్ అయ్యాయి. ఎంపీ అయిన తరువాత కూడా అయినా అదే వివాదాల చుట్టూ పయనం సాగించారు. మహిళతో నగంగా వీడియో మాట్లాడారంటూ సోషియల్‌ మీడియాలో సాగిన ప్రచారంతో ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. ఆ వీడియోపై పెద్ద దుమారమే రేగి, తరువాత చల్లారినప్పటికీ ఆయనకు మాత్రం మాయని మచ్చగానే మిగిలింది.

తెచ్చుకుంటే కేంద్రం నుంచి బోలెడన్ని నిధులు – అయినా నిరాశక్తత

వైసీపీ కూడా అప్పటి నుంచి ఆయనను దూరం పెడుతోంది. రాజకీయం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తదితరులు ముఖ్యమైన నాయకులు వచ్చినప్పుడు తప్పా తక్కినప్పుడు ఎక్కడా ఆయన కనిపించడం లేదు. పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల సమీక్షల్లోనూ ఆయన ఆచూకీ కనిపించడం లేదు. తన నియోజకవర్గం పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోయారు. కేంద్రం ద్వారా వచ్చే నిధులతో చేపట్టే కార్యక్రమాలు అనేకముంటాయి. వాటిని సాధించేందుకు ఆయన పెట్టిన కృషి ఏమిటన్నది తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు ధర్మవరం, హిందూపురం, సోమందేపల్లి ప్రాంతాల్లో చేనేత పరిశ్రమ విరివిగా ఉంది. ఈ పరిశ్రమకు కేంద్రం ఊతమిస్తోంది. అక్కడి నుంచి ప్రత్యేకమైన నిధులు రాబట్టలేకపోయారన్న విమర్శలున్నాయి. అదే విధంగా ఈ ప్రాంతంలోనే పట్టు పరిశ్రమ ఉంది. ఈ పట్టు రైతులకు, రీలర్లకు రావాల్సిన రాయితీలు రాలేదు. దీనిపైనా ఆయన స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎంపీగా మాధవ్ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు. రైల్వేకు సంబంధించి కొత్త ప్రాజెక్టు ఏఒక్కటీ ఈ నాలుగేళ్లలో సాధించలేకపోయారు. ఇక కేంద్ర సంస్థలైన నాసన్‌, బెల్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాటి కోసం ఆయన కృషి చేసింది శూన్యమేనని ఆ ప్రాంతవాసులు విమర్శిస్తున్నారు.

టిక్కెట్ లేదని క్లారిటీ రావడంతోనే సైలెంట్ అయ్యారా ?

వైసీపీ హైకమాండ్ ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేస్తోంది. మాధవ్‌కు ఈసారి అవకాశం దాదాపుగా లేదని నేరుగానే చెప్పారని అంటున్నారు. కొత్తగా టిక్కెట్టు ఆశించే వారు సైతం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యమైన నాయకులను, ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులను కలువడం, తమకు అవకాశం కల్పించాలన్న విజ్ఞాపనలను సైతం అందజేస్తున్నారు. సీఎం జగన్ తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా ఏదో విధంగా న్యాయంచేస్తారని మాధవ్ అనుకుటున్నారు.