గుంటూరుజిల్లాలో ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులే టిక్కెట్ల లభిస్తున్నాయి. అన్ని పార్టీలుజిల్లాలో ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా ఆర్ధిక అంశాలే కీలకంగా ఎంపికలు జరిగాయి. ఒకరిని చూసి మరొకరు పోటీ పోటీగా అసెంబ్లీ స్థానానికి అయితే రూ.30 నుంచి రూ.40 కోట్లు, పార్లమెంటుకు అయితే రూ.100 నుంచి రూ.150 కోట్లు ఖర్చు చేయాలని షరతుపెట్టి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారు కాదు – డబ్బులున్నవారికే !
పార్టీలో సీనియారిటీ కంటే ఎంత ఎక్కువ ఖర్చు చేస్తారు? అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసిన వారి కన్నా ప్రత్యర్థిపార్టీ కన్నా ఎక్కువ ఖర్చుపెట్టగల స్థోమత ఉన్న వారికి అవకాశం ఇస్తున్నారు. ఎన్ఆర్ఐలు, రియల్టర్లు, కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలకు రెడ్ కార్పేట్ వేస్తున్నారు. దీంతో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన వారిని కనీసం కూర్చొబెట్టి మాట్లాడిన పరిస్థితులు లేవు. వేర్వేరు కారణాలతో మీకు ఈసారికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. భవిష్యత్తులో అయినా మంచి హోదా కల్పిస్తాం అని ఒకరిద్దరు ఇన్ఛార్జిలకు తప్ప పార్టీ కోసం పనిచేసిన నేతలకు ఏమాత్రం భరోసా దక్కడం లేదు. వైసిపిలో జంబ్లింగ్ విధానం పాటిస్తుండగా టిడిపిలో కొత్త వారికి ఛాన్సు ఇచ్చి ఎక్కువ మంది పాత వారిని పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
విచ్చలవిడిగా ఖర్చు పెట్టేందుకు టీడీపీ ఎన్నారై అభ్యర్థి రెడీ
ఆర్ధిక అంశం కీలకం కావడంతో టిడిపి,వైసిపిలకు ఎంపి అభ్యర్థుల కోసం కొత్తవారిని వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీలో చేరకుండానే టిక్కెట్లు కేటాయిస్తున్నారు. ముందుగానే ఫలానా స్థానం నుంచిపోటీ చేయడానికి ఒప్పందం చేసుకుని కార్పొరేట్రంగానికి చెందిన వారు పార్టీలోకి వస్తున్నారు. పార్టీకి వారు చేసిన సేవలు ఏమీ లేకపోయినా కేవలం డబ్బు ప్రమాణికంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజా సమస్యలపైపోరాడి, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని పోలీసు కేసులతో ఇబ్బంది పడుతున్న నేతలకు కూడా గుర్తింపులేకుండా పోయింది. గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.. తనతో పాటు అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చు భరిస్తానన్న హామీతో టిక్కెట్ పొందారని అంటున్నారు.
వైసీపీకి అభ్యర్థి కొరత
. కేవలం ఆర్ధిక స్థోమత ఉందా లేదా అన్న కోణంలోనే అభ్యర్థుల ఎంపికను చేపడుతున్నారు. అంతేగాక తాను మీరు అడిగినంత ఖర్చుపెట్టలేనని నిష్కర్షగా చెప్పిన అభ్యర్థులకు టిక్కెట్ ఇవ్వలేమని అధిష్టానం స్పష్టం చేస్తోంది. గుంటూరు ఎంపిగా అభ్యర్థుల ఎంపికలో జాప్యానికి ఇదే కారణంగా నిలిచింది. దీంతో పార్టీలో సీనియర్ అయినా స్థానికంగా మీకు వ్యతిరేకత ఉంది. మీరు గెలవలేరు అనే అంశాన్ని ఒక సాకుగా చూపుతున్నారు.ఒక చోట చెల్లని కాసు మరో చోట చెల్లుతుందా అని ప్రత్యర్థుల నుంచి విమర్శలు వచ్చినా ఏమాత్రం వెనుకంజ వేయలేదు. డబ్బులు పెట్టిన గెలిచిన వాళ్లు తర్వాత డబ్బు సంపాదనకే ప్రాధాన్యం ఇస్తారు.