దక్షిణాది ఎన్నికల్లో ధనప్రవాహం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతోంది. అడిగినా అడగకపోయినా కొన్ని పార్టీలు డబ్బులు వెదజల్లుతున్నాయి. నగదు, మధ్యం, ఉచిత బహుమతులు ఏవంటే అవి ఇచ్చేసి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎంత కావాలో తీసుకోండి మా పార్టీకే ఓటెయ్యండని ఓటర్ల దగ్గరకు వెళ్తున్నాయి. వాళ్ల చేతిలో డబ్బులు పెట్టేందుకు సరికొత్త మార్గాలు వెదుకుతున్నాయి…

రూ. 300 కోట్లతో సరికొత్త రికార్డు

ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసిన గణాంకాలు చూస్తే కళ్లు బయర్లు కమ్మేయ్యడం ఖాయమనిపిస్తోంది. ఎన్నికలకు పది రోజుల ముందే రూ. 300 కోట్ల నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. అంటే పంచింది ఎంత అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక అంచనా ప్రకారం బయటకు తెచ్చిన సొమ్ములో పది శాతం స్వాధీనమవుతుందంటుంటారు. ఎంతపాంచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బెంగళూరుకు ప్రథమ స్థానం

పోలీసుల సాయంతో ఎన్నికల అధికారులు నగదు, వస్తువులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాజదాని బెంగళూరు నగరానికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇప్పటి వరకు అక్కడ రూ. 82 కోట్ల నగదు, ఫ్రీ బీస్ స్వాధీనమయ్యాయి. అసలు ఎన్నికల కోడ్ అమలుకు రాకముందే పంచుడు కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. అభ్యర్థి ఎవరో తెలిసే లోపే ఇంద ఈ డబ్బు ఉంచండి అని కొన్ని పార్టీలు, ఓటర్ల చేతిలో పెట్టేశాయి. శనివారం ఒక చోట రూ. 5 కోట్లు స్వాధీనమయ్యాయంటే క్యాష్ ఫ్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..

మునుగోడు ఆదర్శమా..

గతేడాది తెలంగాణలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికే డబ్బులు పంచే వారికి ఆదర్శంగా చెబుతున్నారు. ఆ ఒక్క నియోజకవర్గంలోనే రూ. 80 నుంచి రూ. 100 కోట్ల వరకు పంచారని అంచనాకు వచ్చారు. ఓటర్లకు ఒక పార్టీ రూ. 5 వేలు ఇస్తే, మరో పార్టీ రూ.4 వేలు చెల్లించి ఓటేయ్యండని దణ్ణం పెట్టింది. దానితో ఓటుకు రూ. 10 వేల వరకు వచ్చాయి. పైగా ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులు రెండు పూటలా భోజనాలు పెట్టి, సారాయి పోశారు. మునుగోడు ఉప ఎన్నికను చూసిన వారికి నయా రాజకీయాలంటేనే అసహ్యం పుట్టే పరిస్థితి వచ్చింది..

తమిళనాట రీఛార్జ్ లు, పాలప్యాకెట్లు

2017 లో చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అవినీతి కేసు కారణంగా జయలలిత రాజీనామా చేయాల్సి రావడంతో ఆమె నెచ్చెలి శశికళ బంధువు టీటీవీ దినకరన్ పోటీ చేశారు. దినకరన్ అనుచరులు ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచారు. డబ్బులు పంచలేని ప్రదేశాల్లో కొత్త పంధాలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఓటర్ల ఫోన్ నెంబర్లు తీసుకుని వాటిని రీఛార్జ్ చేయించారు. కొందరికేమో నెలకు సరిపడా పాల ప్యాకెట్ల డబ్బులను ముందే వ్యాపారులకు చెల్లించేశారు. దానితో ఓటర్ల చేతికి డబ్బులు ఇచ్చే పనిలేకుండా సరిపోయింది. అప్పట్లోనే ఆర్కే నగర్లో రూ. 90 కోట్ల ఖర్చుపెట్టినట్లు చెబుతున్నారు. ఆదాయపన్ను శాఖ రైడ్ చేయడంతో తమిళనాడు మంత్రి విజయ భాస్కర్ నివాసంలో భారీగా నగదు స్వాధీనమైంది. ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. కొన్ని రోజుల తర్వాత ఎన్నిక నిర్వహించగా దినకరనే గెలిచారు. ఎందుకంటే డబ్బు తీసుకున్న జనం ఆయనకు లాయల్ గా ఉన్నారు. ముందు ఇచ్చిన డబ్బులతో పాటు మరికొంత ముట్టజెప్పారనుకోండి. అదే మన ప్రజాస్వామ్యమనుకోవాలా.. లేక పార్టీలు జనానికి లంచాలు అలవాటు చేస్తున్నాయనుకోవాలా….