మొహల్లా క్లినిక్ వర్సెస్ నమ్మ క్లినిక్ – ఇండియా కూటమిలో లుకలుకలు

ఆ కూటమి ఓ కలగూర గంప. అన్ని భావాలు, అన్ని ఆలోచనలు, అన్ని ఆకాంక్షలు కలిసి ఒక చోట ఉండాలన్న ప్రయత్నం. ప్రధాని మోదీని దించెయ్యాలన్న ఏకైక లక్ష్యం వారిని ఒకటిగా చేసినా.. ప్రతీ ఒక్కరూ ప్రధానమంత్రి కావాలన్న ఆలోచన మాత్రం ఐకమత్యంగా ఉంచలేకపోతోంది. ఒకరి పనులను మరోకరు ప్రశంసించాలనుకున్నప్పటికీ ఆకాంక్ష, అహం వారిని వెంటాడుతూనే ఉంది. తాజాగా దినేష్ గుండూ రావు వైఖరిలో కూడా అదే విషయం బయట పడింది. క్షణాల్లోనే ఆయన మాట మార్చిన తీరు అందరనీ ఆశ్చర్య పరచడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గొంతెమ్మ కోర్కెలకు దర్పణం పట్టింది.

గుండూ రావు ఢిల్లీ టూర్

కర్ణాటక ఆరోగ్య మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దినేష్ గుండూ రావు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆప్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక వైద్యశాలలు మొహల్లా క్లినిక్స్ ను సందర్శించారు. ఢిల్లీ ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెంట రాగా, పంచషీల్ మార్గ్ మొహల్లా క్లినిక్ వెళ్లారు. అక్కడి వసతులను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వైద్య ఆరోగ్య రంగంలో ఆప్ ప్రభుత్వ చొరవను ప్రశంసించారు. ప్రజారోగ్య రంగంలో ఆప్ ప్రభుత్వ పనితీరును ప్రశంసనీయమని, తమ ఆరోగ్య వ్యవస్థలను ఎలా మెరుగు పరుచుకోవాలో అర్థం చేసుకునేందుకే వచ్చానని గుండూ రావు వ్యక్తీకరించారు. ఢిల్లీ ప్రజలు కూడా మొహల్లా క్లినిక్స్ పట్ల సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు.

అంతలోనే మాట మార్చిన కర్ణాటక మంత్రి

మొహల్లా క్లినిక్స్ ని ప్రశంసించిన నిమిషాల వ్యవధిలోనే మంత్రి గుండూ రావు అందుకు భిన్నమైన స్టేట్ మెంట్ ఇచ్చేశారు. తాను సందర్శించిన మొహల్లా క్లినిక్స్ లో జనమే లేదని, డాక్టర్లు ఈగెలు తోలుకుంటున్నారని అన్నారు. కర్ణాటకలోని నమ్మ క్లినిక్స్ వీటికంటే మెరుగ్గా ఉన్నాయని తేల్చేశారు. ఢిల్లీ క్లినిక్స్ కు పబ్లిసిటీ ఎక్కువగా ఉందని, నమ్మ క్లినిక్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పుకున్నారు. అక్కడ తక్షణమే టెస్టింగ్, ట్రీటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు.

ఎదురుదాడి చేసిన ఆప్…

దినేష్ గుండూ రావు మాట మార్చడంతో ఆప్ నేతలు ఖంగు తిన్నారు. అంతలోనే తేరుకుని ఎదురుదాడికి దిగారు. గుండూ రావు అనైతికంగా ప్రవర్తించారని అన్నారు. కర్ణాటక నమ్మ క్లినిక్స్ ఒట్టి పేరు మార్పు మాత్రమేనని, అవి బీజేపీ పాలనా కాలంలోనే ఉన్నాయని వారన్నారు. మొహల్లా క్లినిక్స్ గురించి మీడియాతో మాట్లాడుతున్నప్పడు ఆయనకో ఫోన్ వచ్చిందని, ప్రశంసలు వద్దంటూ ఎవరో చెప్పారని దానితో ఆయన మాటమార్చారని ఆప్ నేతలు ఆరోపించారు.ఈ ఫోన్ ఎవరు చేశారో తెలుసుకోవడం కష్టమేమీ కాదని కూడా ఆప్ నేతలు వాదిస్తున్నారు. కేవలం జ్వరానికి మందులు ఇచ్చే నమ్మ క్లినిక్స్ కు అత్యాధునిక సౌకర్యాలున్న మొహల్లా క్లినిక్స్ కు పోలికేమిటని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఇలా ఉండగా రాహుల్ గాంధీ కేసులో సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆశ పెరిగిపోయిందని మిత్రపక్షాలను పక్కకు తోసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.