తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని భారీగా నిర్వహించేందుకు బిజెపి సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా రప్పిస్తోంది. ఈ నెల 7, 11 తేదీల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. నామినేషన్ల పర్వం ముగిశాక, దశలవారీగా కేంద్ర మంత్రులు కూడా ప్రచారంలో పాలు పంచుకోనున్నారు.
ఏడో తేదీన బీసీ ఆత్మగౌరవ సభ
ఏడో తేదీన నిర్వహించబోయే సభ బీసీల సభకా నిర్వహించే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై ఆ కమ్యూనిటీకి భరోసా ఇచ్చేలా ప్రసంగించబోతున్నట్టు సమాచారం. స్వయంగా బీసీ అయిన ప్రధాని మోడీ ఆ సభలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయబోతున్నట్టు రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
బీసీలకు అత్యధిక సీట్లు
బీజేపీ ఈ ఎన్నికల్లో బీసీ నినాదం తీసుకుంది. రాష్ట్రంలో బీసీలను తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. బీజేపీ.. బీసీల పార్టీ అనే అభిప్రాయాన్ని తీసుకెళ్లేలా వ్యూహాలు అమలు చేస్తున్నది. బీజేపీ ప్రకటిస్తున్న అభ్యర్థుల జాబితాలో బీసీలకు పెద్ద పీటు వేస్తూ వస్తున్నది. 52 మంది అభ్యర్థులతో విడుదల చేసిన బీజేపీ తొలి జాబితాలో 20 మంది బీసీ నేతలకు టికెట్ ఇచ్చింది. తాజాగా 35 మందితో విడుదల చేసిన మూడో జాబితాలోనూ 13 మంది బీసీ అభ్యర్థులను ప్రకటించింది.
బండి సంజయ్‌కు ప్రత్యేక హెలికాఫ్టర్
విజయం కోసం శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్న బిజెపి ప్రచారం నిమిత్తం మూడు హెలికాప్టర్లను రప్పిస్తోంది. ఇందులో ఒకటి పూర్తిగా బండి సంజయ్ కు కేటాయించారు. మరో రెండింటిని కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర ముఖ్య నేతలకు కేటాయించినట్లు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని భాజపా ఉద్ధృతం చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారపర్వంలో పాల్గొననున్నారు. ఈ నెల 19వ తేదీ తరువాత మరోసారి ప్రధాని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.