సీఎం కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో కమిటీలు నియమించారు. పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయినా ఇప్పుడు తనది ప్రాంతీయ పార్టీ అన్నట్లుగా ప్రజలకు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామని చెబుతూ టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీగా తెలంగాణ ఆత్మను బీఆరెస్‌గా మార్చడంతో చంపుకొన్నారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. వాటిని బీఆరెస్ నాయకత్వం కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు సీటు కిందకు నీళ్లొచ్చే సరికి మాట మార్చేసింది.
చివరి అస్త్రంగా తెలంగాణ వాదం
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అధినేతగానే మాట్లాడుతుండటం ఆసక్తి రేపుతున్నది. ఎన్నికల ప్రచారసభల్లో మాట్లాడుతున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఇతర నాయకులు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. అవి ఢిల్లీ పార్టీలని, ఆ పార్టీలకు ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నవారు ఢిల్లీకి గులాములని మండిపడుతున్నారు. మళ్లీ తెలంగాణ.. వారికి గులాములుగా ఉండాలా? సీల్డ్ కవర్ సీఎంలు కావాలా? టూరిస్టులు కావాలా? అని ప్రశ్నలు గుప్పిస్తుండటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్ంత చేస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ మీదనే ఆధారపడుతున్నారు. ఢిల్లీ జాతీయ పార్టీలను నమ్మొద్దని వారే చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆరెస్‌నే గెలిపించాలని కోరుతున్నారు. అంటే తాము టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చలేదని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆశలు వదిలేసుకునే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం
బీఆరెస్‌లో కేసీఆర్ తర్వాత కీలక నాయకుడిగా భావించే కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు ఉపన్యాసాలు సైతం అలానే ఉంటున్నాయని చెబుతున్నారు. నిజానికి వారు ఆ విషయం మర్చిపోవడం అనే కంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రాంతీయ సెంటిమెంట్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంటున్నారు. బీఆరెస్‌గా మారిన క్రమంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. పంజాబ్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారు. అక్కడి అధికారంలో ఉన్న నేతలను, ప్రతిపక్ష నేతలను కలిశారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన పనులపై చర్చించారు. రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబ్ రైతులకు, గల్వాన్ పోరులోని అమరుల కుటుంబాలకు చెక్కులతో హల్ చల్ చేశారు. జాతీయ మీడియాలకు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చారు. చివరిి మళ్లీ తెలంగాణ వాదమే దిక్కయింది.
కేసీఆర్ రాజకీయం అటూ ఇటూ కాకుండా పోతుందా ?
కేసీఆర్ రాజకీ చాణక్యం చాలా ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఆయన రాజకీయ వ్యూహాలు చూస్తూంటే… తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో తేడాగా ఉందన్న అభిప్రాయానికి అందరూ వస్తున్నారు. తన పార్టీని అటు దేశానికి.. ఇటు రాష్ట్రానికి కాకుండా చేసుకకుంటున్నారు . తెలంగాణ ఎన్నికల తర్వాత ఆయన మరో రాష్ట్రంలో ప్రచారం చేయలేరు. అంటే తెలంగాణలో ప్రజా విశ్వాసం కోల్పోతారు. బయట పట్టించుకోరు. రెంటికి చెడ్డ రేవడి అన్నమాట.