బెంగాల్ మైనార్టీలను ఆకట్టుకునేందుకు మోదీ మిత్ర ప్రయత్నాలు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్నివర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎవరెవరిని ఎక్కడ దువ్వాలో అధ్యయనం చేస్తూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రాంతాన్ని, ఓటరు నాడిని అంచనా వేస్తూ అక్కడిక తమ శ్రేణులను పంపుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో తటస్థులు, మేథావుల సేవలను వినియోగించుకుంటోంది..

13 జిల్లాలపై ప్రత్యేక దృష్టి

కొన్ని రోజుల క్రితం మోదీ మిత్రాస్ అంటే మోదీ మిత్రులు అన్న తీరులో ఓ కొత్త ప్రచార వ్యవస్థను బీజేపీ ఏర్పాటు చేసుకుంది. మత పరమైన మైనార్టీ గ్రూపులను దగ్గరకు చేర్చి తమ ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. దేశంలోని 65 లోక్ సభా నియోజకవర్గాల్లో మోదీ మిత్రాస్ పనిచేస్తున్నారు. బెంగాల్ రాష్ట్రంలోని 13 జిల్లాలు మోదీ మిత్రాస్ పర్యటిస్తారు. మోదీ ప్రభుత్వ స్కీములను తటస్థుల ద్వారా ప్రచారం చేయడం బీజేపీ ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ్ భారత్ మిషన్, ఉజ్వల యోజన, పీఎం కిసాన్ ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న మేలును ప్రజలకు వివరించేందుకు వారి సేవలను వినియోగిస్తారు..

అల్పసంఖ్యాక స్నేహ సంవాద్ తో ప్రచార కార్యక్రమం

గతేడాది బీజేపీ ఒక ప్రాజెక్టు అమలు చేసింది. దాని పేరు అల్పసంఖ్యాక స్నేహ సంవాద్. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల ద్వారా ప్రచారం చేస్తే దాని ప్రభావం మరింత సానుకూలంగా ఉంటుందన్నది బీజేపీ ఆలోచనా విధానం. దీని వల్ల మైనార్టీ ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం పెరుగుతుందని కూడా విశ్వసిస్తున్నారు. డాక్టర్, ఇంజనీర్, రచయిత, వ్యాపారవేత్త ఎవరైనా మోదీ మిత్రాస్ లో భాగస్వామి కావచ్చు. బీజేపీ గెలిస్తే ముస్లింలను బెంగాల్ నుంచి తరిమి వేస్తారన్న కాంగ్రెస్, తృణమూల్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలంటే మోదీ మిత్రాస్ సేవలను వినియోగించుకోవడం ఒక్కటే మార్గమని బీజేపీ విశ్వసిస్తోంది.

మహిళలు తమవైపేనంటున్న మోదీ

మోదీ మిత్రాస్ పనితీరును ప్రధానమంత్రి కూడా సమీక్షించారు. కొన్ని చోట్ల సమావేశాలు నిర్వహిస్తున్న తీరును మరికొన్ని చోట్ల నిర్వహించబోయే సమావేశాల అజెండాను పార్టీ నేతలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మైనార్టీ వర్గాల్లో మహిళలంతా బీజేపీ వైపే ఉంటారని మోదీ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ముమ్మారు తలాఖ్ రద్దు చట్టం సహా అనేక మైనార్టీ మహిళల అనుకూల చట్టాలను అమలు చేశామని ఆయన గుర్తుచేశారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకశ్మీర్ లో శాంతి స్థాపనకు కృషి చేశామని దాని ప్రభావం దేశంలోని మైనార్టీలందరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతీ లోక్ సభా నియోజకవర్గంలో మైనార్టీల కోసం బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కూడా పార్టీ నేతలను మోదీ ఆదేశించారు.