ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కిలిపి ఓ టార్గెట్ పెట్టుకున్నారంటే.. . దాన్ని సాధించే వరకూ ఊరుకోరన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. ఈ త్రయం ఈ సారి నేరుగా దక్షిణాదిపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. మోదీ తమిళనాడులో పోటీ చేస్తే… దక్షిణాది మొత్తం ప్రభావం ఉంటుందని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇప్పటికే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇదే నిరూపిస్తున్నాయి.
రామనాథపురం నుంచి మోదీ పోటీ చేస్తారా ?
తమిళనాడులో డీఎంకేపై పోరాడుతున్న ఏకైక పార్టీగా బీజేపీ నిలిచింది. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం.. జయలలిత చనిపోయిన తర్వాత వారసత్వ సమస్య ఏర్పడింది. అన్నాడీఎంకేను నడిపించే నాయకుడు లేరు. కానీ డీఎంకేకు ఆ సమస్య లేదు ఆయనకు పోటీగా ఎవరు లేరు. ఇప్పుడు అన్నామలై అనే యువ ఐపీఎస్ అధికారి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నారు. బీజేపీకి ఊపు తెస్తున్నారు. ఇప్పుడు కేంద్రం కూడా అక్కడ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటోంది. పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకుని ప్రధాని మోదీ అభ్యర్థిగా నిలబడితే.. డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చన్న నమ్మకంలో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు.
తమిళనాడులో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ
ద్రవిడ కోటలోకి దూసుకెళ్లేందుకు తమిళనాడులోని ఒక స్థానం నుంచి నరేంద్ర మోదీని పోటీకి దింపేలా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తామని తమిళనాడు బీజేపీ చాలా కాలంగా చెబుతోంది. తమిళనాడులో మోదీ పోటీ చేస్తే.. ప్రభావం తమిళనాడుపైనే కాదు.. మొత్తం దక్షిణాదిపై ఉంటుంది. ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఉన్న దక్షిణాదిలో 130 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. వీటిలో కర్నాటక మినహా మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ కాస్త బలహీనంగా ఉంది. ద్రవిడ భావజాలం ఆధిపత్యంలో ఉన్న రాష్ట్రం తమిళనాడులో మొదటి నుంచి ప్రణాళికబద్దంగా బీజేపీపై వ్యతిరేకత పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడా వ్యతిరేకత తగ్గించేందుకు మోదీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రత్యేకంగా తమిళ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల తమిళ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. కాశీలో తమిళ సంగమంలో పాల్గొన్నారు. తర్వాత తమిళ భాష అత్యంత ప్రాధాన్యమైనదని ప్రకటించారు. సెంగోల్ అంశంతో మోదీపై తమిళనాడులో అభిమానం పెరిగింది. చోళులు తమిళనాడు కేంద్రంగా సుమారు 1500 ఏళ్లు పాలించారని చెబుతున్నారు. శ్రీలంక, థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియాలను ఏలిన చోళులపై తమిళనాడు వాసులకు ఎంతో భక్తి, గౌరవం. 2015 నుంచి తమిళనాడులో విస్తృత కార్యక్రమాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ కూడా తరచూ చోళ రాజుల ప్రస్తావన తెస్తోంది. చోళ సంస్కృతి హిందూ రాజ్య స్థాపనకు మూలమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా గతంలో పదేపదే చెబుతుండేవారు. ఇప్పుడు సమయం చూసుకుని చోళ సంస్కృతికి బీజేపీ పెద్ద పీట వేస్తుందని చాటిచెప్పేందుకు రాజదండంతో బీజేపీ తమిళ ప్రజలకు సందేశం పంపింది.
సాహసమే అయినా ముందుడుగు వేయనున్న మోదీ
తమిళనాడులో మోడీ గెలుపొందడం ఖాయమనే విశ్వాసం బిజెపి నాయకులకు ఉంది. అయితే ప్రధాని మోడీ తన రాజకీయ స్థాయిని పణంగా పెట్టి ఇప్పటివరకు బిజెపిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రం నుంచి బరిలోకి దిగడం ఓ రకంగా సాహసమే. ఇలాంటి సాహసాలు చేయడానికి మోదీ ఏ మాత్రం వెనుకాడరని.. బీజేపీ ని గెలిపించడమే ఆయన లక్ష్యమని చెబుతున్నారు.