మోదీ 9 ఏళ్ల దిగ్విజయ పాలన: ప్రజలకు ఆర్థిక చైతన్యం – ఆర్థిక స్వాతంత్ర్యం !

దేశాన్ని పరిపాలించడం అంటే నాలుగు పథకాలు పెట్టి డబ్బులు అకౌంట్లలో జమ చేయడం లేదా రుణమాఫీ చేయడం కాదు. ప్రజలకు ఆర్థిక స్వాతంత్యాన్ని కల్పించడం ముఖ్యంగా. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో ఈ విషయాన్ని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రయారిటీగా పట్టించుకోలేదు. కానీ ప్రధాని మోదీ ఈ ఆర్థిక స్వాతంత్రం, ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడం ఎంత ముఖ్యమో గుర్తించారు. దాని ప్రకారమే .. తొమ్మిదేళ్లలో వారి రాత మార్చే ప్రయత్నం చేశారు. ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారు. అలాంటి కొన్ని కీలక నిర్ణయాలు ఇవి

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన

ఆగస్టు 15, 2014న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో PMJDY ప్రణాళికను ప్రకటించారు. 44.23 కోట్లకుపైగా జన్‌ ధన్‌ ఖాతాలను తెరిచారు. జన్‌ ధన్‌ పథకం కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.1.5 లక్షల కోట్లు . ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ పథకం కింద బ్యాంకు ఖాతా తెరిచిన కస్టమర్లు ఈజీగా నగదుని బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ముఖ్యంగా ఇది పేద, మధ్య తరగతి వారికి ఎంతో ఉపయోగపడుతోంది. ఈ పథకం కింద ఓపెన్ చేసిన ఖాతాలకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎమర్జెన్సీ సమయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఖాతాల వల్ల దేశంలో నిరక్షరాస్యులు కూడా బ్యాంకింగ్ పై అవగాహన పెరిగింది.

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకం

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరాలని భావించే వారు ప్రతి ఏటా రూ.12 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రమాద బీమా స్కీమ్. ఇందులో చేరితే చాలా తక్కువ ప్రీమియంతోనే అధిక ప్రయోజనం పొందొచ్చు. అంటే మీరు ఏడాదికి రూ. 12 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. లేదంటే ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే.. అప్పుడు కూడా రూ. 2 లక్షలు లభిస్తాయి. పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే అప్పుడు రూ.లక్ష వరకు అందిస్తారు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల నెలకు ఒక్క రూపాయి పొదుపు చేస్తే రూ. 2 లక్షల బెనిఫిట్ లభిస్తుంది.

ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన

ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇతర జీవిత బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఈ బీమా ప్రయోజనం అందించడం కోసం బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. దేశ పౌరులందరికీ జీవిత బీమా ఉండాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. 2015 మే 9న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను ప్రారంభించారు. ఇది ఒక సంవత్సరంపాటు రూ.2లక్షల జీవిత బీమాను అందిస్తుంది. ఈ బీమా తీసుకొన్న వ్యక్తి ఒకవేళ మరణించినట్లయితే.. నామినీకి (వారి కుటుంబానికి) పూర్తి కవరేజీని అందిస్తారు. ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నెట్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అటల్ పెన్షన్ యోజన

9 మే 2015న ప్రారంభించబడిన అటల్ పెన్షన్ యోజన దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడంపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. APY అనేది NPS మొత్తం నిర్మాణం కింద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా నిర్వహించబడుతోంది. APY చందాదారుల సహకారంపై ఆధారపడి, 60 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస పెన్షన్‌కు అందుకోవచ్చు. ఈ స్కీమ్‌ కింద ఇప్పటి వరకు 4 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు. ప్రీమియంలను నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధ-సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. ఎంచుకున్న పెన్షన్ మొత్తం, వ్యక్తి వయస్సు ఆధారంగా కాంట్రిబ్యూషన్ మొత్తం నిర్ణయించబడుతుంది. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల చెల్లుబాటు అయ్యే పొదుపు ఖాతాదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు. ఖాతాదారుడు మరణించిన తర్వాత, జీవిత భాగస్వామికి సమాన పెన్షన్ లభిస్తుంది. ఖాతాదారుడు, అతని/ఆమె జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన సందర్భంలో నామినీకి పూర్తి మొత్తం లభిస్తుంది.

పీఎం ముద్ర యోజన పథకం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్‌లలో ప్రధాన మంత్రి ముద్ర యోజన ఒకటి. ఇందులో మొదటి దశలో చాలా మందికి అండగా నిలిచింది ఈ పథకం. ఈ స్కీమ్‌ కింద బ్యాంకులు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. రుణాలు పొందడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఈ స్కీమ్‌ ద్వారా అర్హులైన వారు సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం ముద్రా యోజన కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం అందజేస్తారు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉన్నాయి. వీటిల్లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా 08 ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల వరకు రుణాలను అందిస్తుంది.

స్టాండ్ అప్ ఇండియా – పీఎం కుసుమ్ యోజన

స్టాండ్ అప్ ఇండియా.. కొత్త ప్రాజెక్టు కోసం బ్యాంక్ ద్వారా షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళా రుణగ్రహితకు రూ.10 లక్షల నుంచి ఒక కోటి రూపాయల రుణం ఇవ్వడం స్టాండ్ అప్ ఇండియా పథకం లక్ష్యం. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. పీఎస్ కుసుమ్ యోజన ద్వారా ప్రభుత్వం.. తమ పొలంలో లేదా ఇంటిపై సోలార్ ప్యానెల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకునే వారికి డబ్బు ఇస్తుంది. దీనితో మీరు మీ ఇంటికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. అదనపు విద్యుత్తును తిరిగి ప్రభుత్వానికి అమ్మవచ్చు. ఈ పథకం ద్వారా విద్యుత్ కోసం అయ్యే ఖర్చు ఆదా చేయడమే కాకుండా.. మీకు ఆదాయం కూడా వస్తుంది. ఈ పథకంలో భాగంగా 60 శాతం సబ్సిడీ ఇస్తారు.

ఎంఎస్ఎంఈ స్కీమ్

మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేసింది. దీని కింద వ్యాపారం ప్రారంభించడానికి స్టార్టప్‌లకు, ఎంఎస్ఎంఇలకు దాదాపు రూ. 2 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది.

స్వనిధి పథకం

ప్రతి వర్గానికి రుణ అందించాలనే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా దేశంలోని వీధి వ్యాపారులకు (చిరు వ్యాపారులు) తమ సొంత పనులను కొత్తగా ప్రారంభించడానికి రుణాలను మంజూరు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్న వ్యాపారం కోసం ప్రజలకు రూ. 10,000 రూపాయల వరకు రుణం ఇస్తారు. ఈ రుణాన్ని ఏడాదిలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకంలో చేరితే కచ్చితమైన పెన్షన్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. ప్రస్తుతం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. అంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల వరకు ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. ఈ పథకంలో 2023 మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ మార్చి 31 తర్వాత వడ్డీ రేటు మారే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. అందుకే ముందుగానే చేరితే 7.4 శాతం వడ్డీని పొందొచ్చు.

ఈ పథకాల ద్వారా కొన్ని కోట్ల మంది ఆర్థికంగా బలవంతులయ్యారు. ఎన్నో సక్సెస్ స్టోరీస్ మన కళ్ల ముందే ఉన్నాయి.