180 దేశాల ప్రతినిధులతో మోదీ యోగా

ప్రపంచాన్ని ఏకం చేసిన మహత్తర సాధనం యోగా. అరోగ్య ప్రదాయిని, మనోల్లాసినీ యోగా. ఉదయమే యోగా చేస్తే రోజంతా ఉత్సాహంగా, ఉల్లసంగా గడిపే వీలుంటుంది. మనిషికి, ప్రకృతికి మధ్య సామరస్యాన్ని సృష్టించేదే యోగా.భర్తృహరి సుభాషితాల నుంచి నేటి గురువుల వరకు ప్రతి ఒక్కరూ యోగా విశిష్టతను పామరులకు సైతం అర్థమయ్యేట్లుగా చెబుతూనే ఉన్నారు.

ఈ సారి అమెరికాలోనే…

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి అమెరికాలోనే యోగా దినోత్సవ వేడుకలను జరుపుతున్నారు. అగ్రరాజ్య పర్యటనలో ఉండే ఆయన జూన్ 21 ఉదయం 8 గంటలకు స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొని అందరినీ ఉత్తేజ పరుస్తారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాలయం దగ్గర నార్త్ లేన్ ప్రాంతంలో జరిగే యోగా డే వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మొత్తం 180 దేశాల దౌత్యవేత్తలు, కళాకారులు, సాంస్కృతిక సారథులు, సామాన్యులు ఈ ఉత్సవంలో పాల్గొని యోగాలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారు. నిత్యం యోగా చేసే మన ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది యోగా దినోత్సవ నినాదాన్ని వసుధైవ కుటుంబకంగా ప్రకటించారు. ప్రపంచమంతా ఒక కుటుంబంలా విశ్వమానవాళి పురోగమనానికి కృషి చేయాలని దాని అర్థం. వివిధ దేశాల్లో జరిగే యోగా దినోత్సవ వేడుకల్లో మొత్తం 25 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. భారతీయుల సంస్కృతీ సంప్రదాయాలకు యోగా దర్పణం పడుతుందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు.

మోదీ చొరవతోనే యోగా దినోత్సవం

ప్రధాని మోదీ 2014లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో తొలి సారి ప్రసంగించారు. అప్పుడు ప్రతీ ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటే బావుంటుందని ప్రతిపాదించారు. భూగోళం ఉత్తరాధ్ర భాగంలో పగలు ఎక్కువగా ఉంటే రోజు అయినందున జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవాలన్న ప్రధాని మోదీ సూచనతో ఐక్యరాజ్యసమితి ఏకీభవించింది. ఒక తీర్మానం చేసి 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నారు.ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి అలోక్ ముఖర్జీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. యోగా దినోత్సవం సందర్భంగా 2015లో రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక పది రూపాయల నోటును విడుదల చేసింది. 2017లో తపాలా శాఖ ఒక స్టాంపును ఆవిష్కరించింది.

అతి పెద్ద యోగా తరగతి..

తొలి సారే యోగా దినోత్సవం సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2015 జూన్ 21న ఢిల్లీ రాజ్ పథ్ దగ్గర యోగా డే వేడుకలు జరిగాయి. ప్రధాని మోదీ సహా 35,985 మంది కలిసి యోగాసనాలు వేశారు. 84 దేశాల ప్రతినిధులు 35 నిమిషాల పాటు 21 ఆసనాలు వేయడం నిజంగా రికార్డే. అప్పటి నుంచి ప్రతీ ఏడాది ఒక థీమ్ తో యోగా దినోత్సవం జరుపుతున్నారు. గతేడాది మానవత్వం కోసం యోగా అనే నినాదంతో యోగా డే నిర్వహించారు. అప్పడు కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. మైసూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో అందరితో కలిసి యోగాసనాలు వేసి వేడుకలను ప్రారంభించారు. యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు, కళారూపాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. .