భారత ప్రధాని నరేంద్రమోదీతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తో భేటీ అయ్యారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియాలో వరసగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఇప్పటికే ఈ ఆంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ప్రధానితో నరేంద్రమోదీ ఈ అంశాన్ని తేవనెత్తారు.
ఆస్ట్రేలియా ప్రధానితో జాయింట్ ప్రెస్ మీట్ లో ఆలయ విధ్వంసానికి సంబంధించిన విషయాలపై చర్చించినట్లు ప్రధాని తెలిపారు. దేవాలయాల ధ్వంసం ఘటనల తర్వాత భారతీయ సమాజానికి భద్రత కల్పిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని హామీ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ఆల్బనీస్ తో దేవాలయాలపై దాడులకు సంబంధించిన ఘటనలు తన దృష్టికి వచ్చాయని, దీనిపై చర్యలు తీసుకుంటానని ఆల్బనీస్ హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ అన్నారు.
ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ వేర్పాటువాదులు హిందూ ఆలయాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. గత వారం బ్రిస్బేన్ లోని ప్రముఖ హిందూ ఆలయం శ్రీ లక్ష్మీ నారాయణ్ ఆలయంపై దాడి చేశారు. గత రెండు నెలల్లో ఇదే విధంగా నాలుగు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 23న, మెల్‌బోర్న్‌లోని ఆల్బర్ట్ పార్క్‌లోని ఇస్కాన్ దేవాలయం గోడలపై “హిందూస్థాన్ ముర్దాబాద్” అనే గ్రాఫిటీతో దాడి చేశారు. జనవరి 16న విక్టోరియాలోని క్యారమ్ డౌన్స్‌లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు దేవాలయం, జనవరి 12న మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ ఆలయంపై దాడులు చేశారు.