అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు మోదీ…

ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. ప్రపంచంలోనే ఆయన నెంబర్ వన్ లీడర్ అని జనమే తేల్చేశారు. ఆయన వెళ్లిన ప్రతీ చోట లక్షలాదిగా జనం తరలి రావడం కూడా ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

మోదీకి 76 శాతం పాపులారిటీ రేటింగ్..

ప్రధాని మోదీకి భారతదేశంలోని 76 శాతం మంది మద్దతు ఉందని మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్థ తేల్చింది. అమెరికా నుంచి సర్వేలు చేసే ఈ సంస్థ తమ దేశాధినేత జో బైడెన్ కు 40 శాతమే రేటింగ్ ఇచ్చింది. నెంబరు 2లో ఉన్న నేత కంటే మోదీ పది శాతం పాయింట్లు ఎక్కువగా ఉన్నారు. మోదీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు యాండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రాడర్ 66 శాతం పాపులారిటీ రేటింగ్ తో రెండో స్థానంలో ఉన్నారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఏలియన్ బెర్సెస్ 58 శాతం రేటింగ్ తో మూడో స్థానంలోనూ, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డీ సిల్వా 49 శాతంతో నాలుగో స్థానంలోనూ ఉన్నారు. భారతదేశంలో ప్రస్తుతం మోదీని 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఆరు శాతం మంది ఎటూ తేల్చుకోకపోతున్నారు…

వరుసగా విజయాలతో పెరిగిన మోదీ పరపతి

ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మరో సర్వేలో కూడా మోదీ అత్యంత జనాదరణ ఉన్న నేతగా నిలిచారు. అప్పటికి ఇప్పటికి రేటింగ్ లో ఎలాంటి మార్పు కనిపించలేదు. మోదీ పరపతి యథాతథంగా కొనసాగింది.దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ కరిష్మాతో బీజేపీ సునాయాసంగా గెలుస్తున్న తరుణంలో ప్రధాని పాపులారిటీ పెరగడమేగానీ తగ్గడం లేదని తేలిపోయింది. ఇటివల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. తెలంగాణలో తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది.దానితో ఉత్తరాదినే కాదు, దక్షిణాదిన కూడా మోదీ ప్రభ వెలిగిపోతోందని తేల్చేశారు.

స్థిరత్వమే మోదీ నినాదం…

ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలంటే ఏమేమి కావాలో మోదీకి బాగా తెలుసు. స్థిరమైన పాలన అందించడమే తమ లక్ష్యమని, శక్తిమంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడే పాలన సజావుగా సాగించే వీలుంటుందని ప్రధాని ప్రవచిస్తారు. అందుకే ప్రజలకు కూడా ఆయనంటే గౌరవాభిమానాలున్నాయి. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే బీజేపీ నినాదమని మోదీ తరచూ చెబుతుంటారు.దేశంలో పేదలే అతి పెద్ద కులమని వారి అభ్యున్నతికి కృషి చేయడమే ప్రథమ సేవకుడిగా తన కర్తవ్యమని కూడా మోదీ గుర్తుచేస్తుంటారు. పేద, అల్పాదాయ వర్గాలకు కావాల్సిందేమిటో మోదీకి తెలిసింతంగా వేరెవ్వరికీ తెలియకపోవచ్చు. అందుకే ఆయన ప్రపంచ నెంబర్ వన్ పాపులర్ నేత అయ్యారు. దీనితో బీజేపీకి కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పక తప్పదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో అధికారం దిశగా పార్టీ పరుగులు తీస్తుందని చెప్పేందుకు మోదీ పాపులారిటీనే నిదర్శనమవుతుంది.