తెలుగులో ప్రజాదరణ అన్నా… ఆంగ్లంలో పాపులారిటీ అని పిలిచినా.. ఏదేనా సరే ఒక రోజులో వచ్చేది కాదు. సంవత్సరాల తరబడి అంకిత భావంతో పని చేస్తూ ప్రజా సంక్షేమమే శ్వాసగా రాజకీయాలు చేసే వారికి మాత్రమే శాశ్వత ప్రజాదరణ ఉంటుంది. ఒక రాష్ట్రం ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజాదరణ తగ్గిపోయిందనుకుంటే పొరపాటే అవుతంది. విపక్ష పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నా మోదీకున్న ప్రజాదరణలో ఒక్క పర్సెంటేజ్ పాయింట్ కూడా తగ్గించలేకపోయారు. నిన్నా, నేడు, రేపు ఆయనే ప్రజాదరణ ఉన్న నాయకుడని తాజా సర్వేలు నిరూపించాయి.
ప్రధానిగా ఆయనకు మాత్రమే ఓటు
లోక్ నీతి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీడీఎస్) కలిసి ఎన్టీటీవీ కోసం నిర్వహించిన సర్వేలో దేశంలో మోదీ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని, పైగా రోజురోజుకు పెరుగుతోందని నిరూపితమైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలోనే మే 10 నుంచి 19 వరకు దాదాపు 20 రాష్ట్రాల్లో అన్ని వర్గాలు, అన్ని వయసుల వాళ్లని సర్వే చేసిన రూపొందించిన నివేదిక ఇది. మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సర్వే చేశారు. మొత్తం 71 లోక్ సభా నియోజకవర్గాల్లో 7 వేల మందికి ప్రశ్నావళి ఇచ్చి సమాధానాలు రాబట్టారు.
మూడో టర్మ్ ఖాయం..
ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఎన్డీయే వరుసగా మూడో సారి విజయం సాధించడం ఖాయమని తాజా సర్వే నిగ్గు తేల్చింది. శ్రేయో రాజ్యంలో ఉంటున్న దేశ ప్రజలకు కూడా ఇదీ శుభ పరిణామమే అవుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీయే గెలుస్తుందని 43 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు 29 శాతం మంది సమర్థింపు మాత్రమే లభించింది. 2019లో బీజేపీ ఓట్ షేర్ 37 శాతం ఉండగా, అదిప్పుడు 43 శాతానికి పెరిగింది.
మోదీ మళ్లీ ప్రధాని కావాలని 43 శాతం మంది ఆకాంక్షిస్తుంటే, రాహుల్ వైపు 27 శాతం మంది ఉన్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కు కేవలం తలా నాలుగు శాతం ఓట్లే వచ్చాయి. 2024లో మోదీని ఛాలెంజ్ చేసే నాయకుడెవరని అడిగిన ప్రశ్నకు రాహుల్ కు అవకాశం ఉందని 34 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీకి పోటీ లేదని తొమ్మిది శాతం మంది అన్నారు. విపక్షాల ఐక్యత కోసం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు ఒక శాతం మద్దతు కూడా లేదు.
ప్రభుత్వ పనితీరుపై హర్షం
వేర్వేరు రంగాల్లో ప్రభుత్వం చేస్తున్న కృషితో సంతృప్తి 55 శాతం మంది రెస్పాండెంట్స్ అభిప్రాయపడ్డారు. మోదీ మంచి వక్త అని, ఆయన మాటలతో సమ్మోహనాస్త్రాలు సంధిస్తారని 25 శాతం మంది ఒప్పుకున్నారు. మోదీ అభివృద్ధి అజెండాను 20 శాతం మంది మెచ్చుకున్నారు. శ్రమయేవ జయతే అని భావించే వారిలో మోదీ అగ్రగణ్యులని 13 శాతం మంది అన్నారు. మోదీ విధానాలు అమోఘమని 11 శాతం మంది ప్రకటించారు.
సీబీఐపై మిశ్రమ స్పందన
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ ఆంశం కూడా సర్వేలో భాగమైంది. దీనిపై జనంలో మిశ్రమ స్పందన కనిపించింది. సీబీఐ, ఈడీ రెండూ చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నాయని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్షసాధింపుకు సిబీఐని వాడుతున్నారని 32 శాతం మంది అన్నారు..
ఏదైమైనా మోదీ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని తాజా సర్వేలు చెబుతున్నాయి. దేశానికి ఆయనే ఏకైక నాయకుడని వివరిస్తున్నాయి. నిన్న ఆస్ట్రేలియా పర్యటనలో మోదీ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన జనం కూడా ఆయన పట్ల ఉన్న వాత్సల్యాన్ని ప్రదర్శించడం ముదావహమే అవుతుంది.