బీజేపీకి తరగని సంపద మోదీ – ఆ సిన్సియారిటీ మరో నేతలో చూడగలమా ?

ఓ ఆటగాడు తన కెరీర్ ప్రారంభించినప్పుడు మొదటి ఆటలో ఆడేంత డెడికేషన్.. ఉన్నత స్థానానికి చేరిన తర్వాత ఉంటుందా ?. దాదాపుగా ఉండదు. మనం ఉన్నత స్థానానికి చేరాం కదా.. ఆ స్థాయిలో మళ్లీ కృషి చేయడం ఎందుకన్నా ఓ మైండ్ సెట్ వచ్చేస్తుంది. చేయకపోతే ఏమవుతుందన్న ఓ నిర్లక్ష్యం చుట్టు ముడుతుంది. కానీ మొదటి ఆటలో ఎంత సిన్సియారిటీ, తీక్షణత, పట్టుదల ఉంటుందో.. ఉన్నత స్థానానికి చేరిన తర్వాత కూడా అలాగే ఉందంటే.. ఖచ్చితంగా లెజెండ్ అవుతారు. అది ఆటలోనయినా రాజకీయాల్లో అయినా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ లెజెండ్‌కు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. దానికి కళ్ల ముందు కనిపించే సాక్ష్యం కర్ణాటక ఎన్నికలు.

కర్ణాటక ఎన్నికల ప్రచార బాధ్యతను మీద వేసుకున్న మోదీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ అంటే వినిపించిన పేరు నరేంద్రమోదీ మాత్రమే. రెండు రోజులు బెంగళూరులో రోడ్ షో నిర్వహించారు. అంతకు మించి జిల్లాల్లో పర్యటించారు. ఎక్కడా ఎనర్జీ తగ్గలేదు. ఎలక్షన్ ర్యాలీలు నిర్వహించడం.. రోడ్ షోలు నిర్వహించడం .. అదీ కూడా సమ్మర్‌లో అంటే చిన్న విషయం కాదు. ఆయన వయసు డెబ్భై దాటిపోయింది.కానీ అది పేరుకే. ఇప్పటికీ యువ నేతలు అని చెప్పుకునేవారు.. వరుసగా వారం రోజులు ప్రచారం చేయలేనంత శారీరక ఫిట్ నెస్ లేమితో ఉంటారు. కానీ ప్రధానమంత్రి మాత్రం.. కొంత మంది ఎప్పటికీ యువకులే అని అనుకునేలా అకుంఠిత పట్టుదల చూపించారు.

ప్రపంచంలో పవర్ ఫుల్ లీడర్ అయినా పార్టీ కోసం అవిశ్రాంతమైన పని

నిజానికి చావో రేవో అన్నట్లుగా పోరాడే నేతలు వేరుగా ఉంటారు. ఈ ఎన్నికల్లో గెలవకపోతే తమ రాజకీయ జీవితం అంతమైపోతుందని భయపడే నేతలు ఎంతకైనా తెగించి పోరాడుతూ ఉంటారు. కానీ నరేంద్రమోదీపై కర్ణాటక ఎన్నికల ప్రభావం చాలా స్వల్పం. కర్ణాటకకు జరుగుతున్న ఎన్నికలు అసెంబ్లీవి. ఆ ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి మోదీపై కానీ.. కేంద్రంపై కానీ.. బీజేపీ పై కానీ ఎలాంటి ప్రభావం చూపే చాన్స్ లేదు. కానీ నరేంద్రమోదీ.. అంతా తానే బాధ్యత తీసుకున్నారు. అవిశ్రాంతంగా శ్రమించారు. తన మొదటి ఎన్నికల విషయంలో ఎంత డెడికేషన్ చూపించారో.. దేశ అత్యున్నత పదవిలో ఉంటూ.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్‌గా పేరుతెచ్చుకున్న తర్వాత కూడా అదే పద్దతిలో సిన్సియారిటీ చూపిస్తున్నారు. ఆ పట్టుదలే.. ఆ పని తనం.. ఆ పనితీరే దేశ ప్రజలందరికీ నచ్చుతోంది.

చరిత్రలో నిలిచిపోయే నేతల కృషి, పట్టుదల అంతే !

కెరీర్ ప్రారంభించినప్పుడు తొలి రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో.. చివరి రోజూ కూడా అంతే ఉంటే.. వారు చరిత్రలో నిలిచిపోతారు. నరంద్రమోదీ ఈ విషయంలో ఎప్పుడూ లెక్క తప్పలేదు. ఆయన రాజకీయ పయనం సాగినంత కాలం భారతీయ జనతా పార్టీ విషయంలో ఆయన సిన్సియారిటీలో ఒక్కశాతం కూడా మార్పు రాదని కర్ణాటక ఎన్నికల ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటి నేత బీజేపీకి ఉండటం వల్లనే ఈ రోజు .. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఉంది.తిరుగులేని శక్తిగా ఉంది. ఎవరికైనా శ్రమే విజయం తెచ్చి పెడుతుంది. అది నరేంద్రమోదీగారు నమ్మే సూత్రం.. మనంందర్నీ ఆచరించేలా చేస్తున్న సంకల్పం.