2024 లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. అంతక ముందు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయదుంధుబి మోగించేందుకు సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. పాత వ్యూహాలకు పదును పెడుతూ, కొత్త వ్యూహాలకు శ్రీకారం చుడుతూ ముందుకెళ్తోంది. అన్ని వర్గాల ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది. అందుకోసం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
త్వరలో మైనార్టీ మోర్ఛా ర్యాలీ
హరిజనులు, గిరిజనులతో కలిపి పస్మాంద ముస్లింలను ఆకట్టుకునేందుకు పార్టీలోని ఆయా వర్గాల నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అక్టోబరు నెలలో మైనార్టీ మోర్ఛా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించబోతోంది. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కావడమే కాకుండా ప్రత్యేక పథకాలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు 15 స్కీములు అమలు చేస్తోంది. అందులో చదువులకు ఇచ్చే ఉపకార వేతనాలు, స్కిల్ డెవలప్ మెంట్ స్కీములతో పాటు ఆర్థిక స్వావలంబనా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. నేషనల్ మైనార్టీ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోను వసతి కూడా కల్పిస్తున్నారు.
పస్మాంద ముస్లింలు అంటే ఎవరూ.. ?
పస్మాంద ముస్లింలు అనేది నిజానికి కొత్త పదమేమీ కాదు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ నోటి వెంట ఆ పదప్రయోగం జరగడంతో ఇప్పుడు మళ్లీ విరివిగా వాడుతున్నారు. పస్మాంద ముస్లింలు ఎవరు, వారి సంస్కృతిక, సామాజిక నేపథ్యం ఏమిటన్న ఆసక్తి బయలుదేరింది. పస్మాంద అనేది పర్షియన్ పదం. దీనికి ‘వెనుకబడిన వారు’ అని అర్థం. సమాజంలోని ఇతర వర్గాలతో పోలిస్తే, పురోగతిలో వీరు వెనుకబడి ఉన్నారని అర్థం. వీరి వెనుకబాటుతనానికి ఒక పెద్ద కారణం కుల వ్యవస్థ అని చెబుతారు. మొదట్లో పస్మాంద అని ఒక వర్గాన్ని మాత్రమే పిలిచేవారు. కానీ, సంవత్సరాలు గడిచేకొద్దీ ముస్లింలలో వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారందరినీ ఈ పేరుతోనే పిలవడం ప్రారంభించారు. ముస్లింలలో కూడా కుల వ్యవస్థ ఉందని, కొందరు వివక్షకు లోనవుతున్నారని అర్థం చేసుకోవాలి. వారిని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. ఉత్తర భారత దేశంలో అలాంటి వారు ఎక్కువగా ఉన్నందున నేతలంతా పస్మాంద జనాభా ఎక్కడ ఉందో చూసి వారి సంక్షేమానికి కృషి చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశించింది.
3.25 లక్షల మోదీ మిత్రాలు…
మైనార్టీలకు పార్టీ పట్ల విశ్వాసం పెరిగి దిశగా రాజకీయాలతో సంబంధం లేని వారిని దగ్గరకు చేర్చుకునే ప్రక్రియను ప్రారంభించారు. ప్రతీ చోట మోదీ మిత్ర పేరుతో సంఘాలు ప్రారంభించి మైనార్టీలను ఆకట్టుకుంటున్నారు. ఈ నెలాఖరుకు 3.25 లక్షల మోదీ మిత్ర గ్రూపులు సిద్ధమవుతాయని మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధీఖీ ప్రకటించారు. మోదీ మిత్రలకు పార్టీతో ఎలాంటి సంబంధం ఉండదని, ముస్లిం ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఇవి పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బిహార్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మోదీ మిత్రలు ఎక్కువగా ఉన్నాయి.