MLC Kavitha: మహిళను ఈడీ ఆఫీస్‌కి ఎలా పిలుస్తారంటూ సుప్రీం కోర్టులో కవిత పిటిషన్.. విచారణకు ముందు ట్విస్ట్..

ఈడీ ఆఫీస్‌కి పిలిచి విచారించడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు.

ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫు లాయర్ వివరించారు. ఫోన్‌ సీజ్ వ్యవహారాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు కవిత. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్‌ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

గురవారం విచారణ నుంచి కూడా మినహాయింపు కోరారు కవిత. అయితే ఈ కేసులో కవితకు కోర్టు నుంచి చుక్కెదురైంది. మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 24కు వాయిదా వేసింది. దీంతో గురువారం ఈడీ విచారణకు కవిత హాజరు కానున్నారు.

అయితే, ఇంటికొచ్చి విచారించమని ఈడీకి కవిత మొదటి ఆప్షన్ ఇచ్చారు. రెండో ఎంపికగా వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాట్లు కూడా చేస్తానని రెండో ఆప్షన్ ఇచ్చారు. నిందితుడు కస్టడీలో ఉన్ననేపథ్యంలో ఆ రెండు ఆప్షన్స్‌కి నో చెప్పింది ఈడీ. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.

ఇదిలావుంటే, బీఆర్ఎస్ ఢిల్లీకి బయలుదేరారు. భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇవాళ న్యూఢిల్లీలో ఇతర రాజకీయ పార్టీలు, పౌర సామాజిక సంస్థలతో కలిసి రౌండ్‌ టేబుల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందులో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలనే అంశంపై ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం చర్చించనున్నారు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ సమావేశం ఉండనుంది. ఈ సమావేశాన్ని భారత్ జాగృతి సంస్థ ప్రతినిధులు భారీగా హాజరుకానున్నారు.