MLC Elections: రాజోలు ఎమ్మెల్యే.. రాపాక వరప్రసాద్ సంచలన విషయాలు వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే.. తనకు రూ.10 కోట్లు ఇస్తానన్నారని కీలక విషయం చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత టీడీపీ తనతోనే బేరసారాలు జరిపిందని పేర్లతో సహా వెల్లడించారు. తన ఓటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముకుంటే.. పది కోట్లు వచ్చి ఉండేవని వ్యాఖ్యానించారు. రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ Rapaka Varaprasad ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆంధ్రా రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.
‘నా మిత్రుడు కేఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు ఆడారు. ఆయన రాపాక అలాంటి వారు కాదని చెప్పారు. అసెంబ్లీ దగ్గర కూడా ఒక రాజుగారు నాతో బేరానికి వచ్చారు. టీడీపీకి ఓటేయాలని కోరారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. నాకు డబ్బులు ఎక్కువై.. వద్దనలేదు. సిగ్గు, శరీరం వదిలేసి ఉంటే రూ.10 కోట్లు వచ్చి ఉండేవి. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేం. జగన్ నాయకత్వాన్ని నమ్మాను కాబట్టే.. టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించాను’ అని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఇదే విషయంపై.. రాపాక వరప్రసాద్ ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. కీలక విషయాలు చెప్పారు. తనతో మాట్లాడింది టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అని బాంబ్ పేల్చారు. తనతో టీడీపీ బేరాలు జరిపిన విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే సతీష్, మంత్రి వేణుగోపాల కృష్ణకు చెప్పానని.. రాపాక వెల్లడించారు. అయితే.. వారు పార్టీ అధిష్టానానికి చెప్పారో.. లేదో.. తనకు తెలియదని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డికి ఈ విషయాన్ని తాను చెప్పలేదని రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని పార్టీకి ముందే తెలుసన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 6 వైసీపీ గెలుచుకుంది. ఒక స్థానంలో టీడీపీ విజయం సాధించింది. అయితే.. ఆ ఒక్క స్థానం కూడా తమకే వచ్చేదని.. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి.. ఈ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలిచేలా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. రాపాక వరప్రసాద్ సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై ఇటు వైసీపీ.. అటు టీడీపీ ఎలా రియాక్ట్ అవుతాయోనన్న ఆసక్తి నెలకొంది.