పథకాల కన్నా ఎక్కువ నష్టం చేసింది అధికార దుర్వినియోగమే – ఆ తప్పును గుర్తించలేకపోయిన వైసీపీ !

2019లో 151 సీట్లు 50 శాతం ఓట్లతో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. పది శాతానికిపైగా ఓట్లను కోల్పోయారు. అధికారాన్ని పోగొట్టుకున్నారు. అత్యంత భారీ మెజార్టీతో గెలిచి దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన ఇప్పుడు అదే స్థాయిలో ఓడి.. మరోసారి దేశం దృష్టిని ఆకర్షించారు.

చంద్రబాబు అరెస్టుతో సానుభూతి రాజకీయం

రాజకీయాల్లో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడితే వారికి సానుభూతి వస్తుంది. వారిని అరెస్టు చేయాలలంటే.. ఖచ్చితంగా తప్పు చేశారన్న ఆధారాలను ప్రజల ముందు ఉంచాల్సి ఉంది. అయినప్పటికీ ప్రజల సానుభూతి లభిస్తుంది. అందుకే రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడానికి అధికారంలో ఉన్న వారు సందేహిస్తారు. కానీ జగన్ అలా అనుకోలేదు. గత ఎన్నికల్లో ఓట్ల చీలిక ద్వారా వైసీపీ అధినేత జగన్ భారీగా లాభపడ్డారు. కానీ ఈ సారి అలాంటి అవకాశాన్ని విపక్షాలు ఇవ్వలేదు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు.. ఓటు బ్యాంకులన్నీ కలసిపోవడంతో.. వైసీపీపై స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. వారు అలా కలసి పోవడానికి కూడా జగనే కారణం.

పోలవరం, అమరావతి కూడా సమస్యలే !

విభజన తర్వాత ఏపీకి ఆశాకిరణాలుగా మారింది రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం, తాము వస్తే శరవేగంగా నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో వాటిని నిర్వీర్యం చేశారు. అసెంబ్లీలోకి అమరావతికి మద్దతు తెలిపి మరీ .. ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ తాను వచ్చాక మూడు రాజధానులని మాట మార్చారు. ఫలితంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. పోలవరం టీడీపీ హయాంలో శరవేగంగా నిర్మాణం జరిగితే.. వైసీపీ హయాంలో ఒక్క శాతం కూడా ముందడుగు పడలేదు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరో సమస్య

అదే సమయంలో ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరుకున్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్క సారిగా తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఉండటంతో అందులోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ చట్టంలో వివాదాస్పదమైన అంశాలు ఉండటం.. తమ చేతుల్లో ఉన్న ఆస్తికి ప్రభుత్వం వద్ద మళ్లీ సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుందని.. ఈ క్రమంలో వివాదంలో పడితే ఏమీ చేయలేమన్న అభిప్రాయం ఏర్పడితే ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అది ఓట్ల రూపంలో ప్రతిఫలించింది.

పురుష ఓటర్లలో మద్యం విధానంపై వ్యతిరేకత

పురుష ఓటర్లలో అత్యధికులు వైసీపీ, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారని తేలింది. వాటికి ప్రధాన కారణాల్లో ఒకటి నాసిరకం మద్యం, ప్రభుత్వం మారగానే కొత్త మద్యం విధానం తీసుకువచ్చారు. మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వెళ్లింది. ప్రముఖ బ్రాండ్లేమీ అమ్మకానికిలేవు.పూర్తిగా కొత్త బ్రాండ్లు, నాసిరకం మద్యం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా పురుషులు..గతంలో వైసీపీకి ఓటేసిన వారు కూడా ప్రభుతవానికి వ్యతిరేకమయ్యారు.