తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీతో మైండ్ గేమ్ ఆడేందుకు అన్ని రకాల పొలిటికల్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఓ వైపు జగన్ రెడ్డి మరో వైపు చంద్రబాబు బీజేపీ పెద్దలతో సమావేశమై.. తమ పార్టీ బీజేపీతో పొత్తులు పెట్టుకోబోతోందని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో బీజేపీ క్యాడర్ లో అయోమయం ఏర్పడుతోంది. ఒక్క ఏపీలోనే కాకుండా.. తెలంగాణలోనూ అదే గందరగోళం సృష్టించే కుట్రను.. ఈ పార్టీలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసలు వీరు ఎందుకు బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్నారో మాత్రం బయటకు చెప్పడం లేదు. ఇక్కడే అసలైన కుట్ర ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అమిత్ షాతో జగన్ భేటీ తర్వాత బీజేపీతో పొత్తంటూ వైసీపీ వర్గాల ప్రచారం
ఇటీవల నీతి ఆయోగ్ సమావేశం కోసం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. తర్వాత అమిత్ షాతో భేటీ అయ్యారు. లోపల ఏం చర్చించారంటే… అధికారిక విషయాలని ప్రెస్ నోట్ విడుదల చేశారు. కానీ బయటకు మాత్రం ఎన్డీఏలోకి వైసీపీ అనే ప్రచారం చేశారు. ఏపీలో ప్రభుత్వంపై బీజేపీ నేతలు తెగించి పోరాడుతున్నారు. కేంద్రం ఎన్ని వేల కోట్ల నిధులిచ్చినా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ నాశనం చేసిందన్న అభిప్రాయంలో బీజేపీ ఉంది. అయితే బీజేపీ జనంలోకి వెళ్తూండటంతో.. తాము బీజేపీ ఒకటే అనే కుట్రపూరిత ప్రచారం కోసమే ఈ భేటీని ఉపయోగిచుకుంది వైసీపీ . ఆ భేటీ తర్వాత కూడా ఏపీ బీజేపీ నేతలు ఎక్కడా తగ్గలేదు. ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు.
తాజాగా చంద్రబాబు ఢిల్లీ తర్వాత టీడీపీతో పొత్తులంటూ ప్రచారం
చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో ..బీజేపీ అగ్రనేతల్ని ఎందుకు కలిశారో మాత్రం చెప్పలేదు. అసలు కలిసినట్లుగా అధికారిక సమాచారం కూడా లేదు. ఫోటోలు కూడా విడుదల కాలేదు. కానీ టీడీపీతో బీజేపీ పొత్తులన్న ప్రచారం చేశారు. ఈ ప్రచారం వెనుక కూడా విస్తృతమైన కుట్ర ఉందని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి . తెలంగాణ లో బీజేపీ అధికారానికి పోటీ పడుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీతో లింకప్ చేయడం వల్ల … సెంటిమెంట్ రగిల్చి అక్కడ బీజేపీని ఇబ్బది పెట్టాలనే కుట్ర ఉందని అనుమానిస్తున్నారు.
బీజేపీ హైకమాండ్ అసలు అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా చేసుకుంటున్నారా ?
కేంద్రంతో అధికారంలో ఉన్నపెద్దలను కొన్ని వందల మంది కలుస్తూ ఉంటారు. అయితే ఇలా ఎవరూ ప్రచారం చేసుకోరు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయపార్టీల నేతలే చేసుకుంటారు. ఈ విషయాలు ఢిల్లీ పెద్దలకు తెలియడం లేదు. బీజేపీని వారు బద్నాం చేస్తున్నారన్న సంగతి తెలిసిన రోజు.. ఈ నేతలకు ఢిల్లీ పెద్దలు అపాయింట్ మెంట్లుకూడా ఇవ్వడం మానేస్తారన్న వాదన వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదగకుండా కుమ్మక్కయిటన్లుగా ఈ భేటీలు, ప్రచారాలు చేయడంపై నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆ పార్టీ నేతలంటున్నారు.