తెలంగాణ కాంగ్రెస్‌కు వలస నేతలే దిక్కు – ఎన్నికల ఫలితాల తర్వాత అంతా జంపింగేనా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వలస నేతలపై ఆధారపడుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా.. ఇతర పార్టీల నుంచి తీసుకు వచ్చి వారికి టిక్కెట్లు కట్టబెడుతోంది. ఖమ్మం నుంచి ప్రారంభించి ఆదిలాబాద్ వరకూ ఎవరు పార్టీలో చేరితే వారికి టిక్కెట్లు ప్రకటిస్తున్నారు. అయితే అవకాశం కోసం వస్తున్న వీరంతా ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండటం అసాధ్యమని ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు.

రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ ఇంకా నమ్ముతుందా ?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి మునుగోడు నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే.. నిజమైన గోడ మీద పిల్లి వాటం రాజకీయ నాయకుడు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనుకుంటారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన నిర్వాకం.. కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచింది. బీజేపీని మోసం చేసి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. కానీ వీరు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారన్న గ్యారంటీ ఏమిటి ?. బీఆర్ఎస్ లేదా బీజేపీ నుంచి బంపర్ ఆఫర్ వస్తే క్షణాల్లో పార్టీ ఫిరాయిస్తారు. అందులో సందేహమే లేదు.

పార్టీలో చేరుతున్న వారందరిదీ అదే బాపతు రాజకీయం

తమ్ముల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారవు,మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డికి టిక్కెట్లు ఆఫర్ చేస్తేనే కాంగ్రెస్ లోకి వచ్చారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నుంచి పోటీలో ఉండబోతున్న జగదీశ్వర్ గౌడ్, బండి రమేష్ కూడా ఫిరాయింపు దారులే. ఇలాంటి వారు కనీసం పదిహేను మందికి టిక్కెట్ ఇవ్వబోతున్నారు. వీరిలో అత్యధికులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నారు. గతంలో చాలా మంది కాంగ్రెస్ నేతలే. కానీ.. అధికారం అనే ఆయుధం కోసం కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. ఇరప్పుడు కాంగ్రెస్ గాలి వీస్తుందనో.. పోటీ చేయడానికి అవకాశం వస్తుందనో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. వీరిపై .. కాంగ్రెస్ నమ్మకం పెట్టుకోవడం కష్టమే.

ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఖాళీ

తెలంగాణ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత హోరోహోరీగా సాగబోతున్నాయి. హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎక్కువ సర్వేలు చెబుతున్నాయి. హంగ్ అంటూ వస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇట్టే అమ్ముడుపోతారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలుపు గుర్రాలపేరుతో ఫిరాయించిన వాళ్లే. వారు తమకు బెస్ట్ ఆఫర్ ఏదనుకుంటే అందులోకి వెళ్లిపోతారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విలపించి ప్రయోజనం ఉండదు. గెలుపు గుర్రాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. వారంతా అధికారం, పదవుల లక్ష్యంతోనే వచ్చారు. వారిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ మరో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ప్యారాచూట్ నేతలతో కాంగ్రెస్ పార్టీ డేంజరస్ గేమ్ ఆడుతోంది. అది ఆ పార్టీని ముంచేసినా ఆశ్చర్యం లేదు.