రాజకీయ నాయకులు అధికారులు కుమ్మక్కయితే ఎంతటి అవినీతికైనా దిగే అవకాశం ఉంది. ప్రజాధనాన్ని పెట్టేల్లో పెట్టుకుని తీసుకెళ్లే అవకాశమూ ఉంది. జనానికి తెలియకుండానే వారి జేబులు కత్తిరించే వీలుంది. తర్వాత ప్రజలు లబోదిబోమంటుంటే కల్లబొల్లికబుర్లతో టైమ్ పాస్ చేసే టెక్నిక్ ఉంది. ఇప్పుడు జార్ఖండ్ లో అదే జరుగుతోంది. తమకు తెలియకుండానే పేద రైతులు అవినీతి ట్రాప్ లో పడిపోయారు.
పర్ డ్రాప్ మోర్ క్రాప్ పేరుతో దగా
జార్ఖండ్ లో జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధాన్ మంత్రి క్రిషి సీంచాయీ యోజనలో భాగంగా బిందు సేద్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు జార్ఖండ్ లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ చుక్కలో అదనపు పంట సాధించే స్కీము అది. 2011 నుంచి ఈ స్కీము ఉన్నప్పటికీ జార్కండ్ ఇటీవలే దానికి సంబంధించిన భారీ స్కామ్ బయటకు వచ్చింది. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం పేరుతో హజారీబాగ్ సహా పలు జిల్లాల్లో అవినీతికి తెరతీశారు.
కాగితాలపై లెక్కలు – కనిపించని లబ్ధిదారులు
స్కీమ్ ప్రకారం డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అమర్చేందుకు పది శాతం వ్యయం రైతులు భరించాలి. 30 శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. మిగతా 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అక్కడే పెద్ద స్కామ్ జరిగిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరా, రెండెకరాలు ఉన్న వారికి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. అలా ఆరు వేల మంది లబ్ధిదారులున్నట్లు మొత్తం యాభై కోట్ల రూపాయలతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించినట్లు ప్రభుత్వం లెక్కలు రాసుకుంది.. అయితే ప్రభుత్వ లెక్కల్లో ఉన్న లబ్ధిదారులను వెదకడమే పెద్ద సమస్యగా మారింది. కొన్ని దొంగ పేర్లు తెరపైకి వచ్చాయి. కొందరు కనిపిస్తున్నప్పటికీ తమకు ఎలాంటి పరికరాలు అందలేదని వాళ్లు తేల్చేశారు. ఒక్క అధికారి కూడా తమ వద్దకు రాలేదని కొందరన్నారు.
ఆధార్ కార్డ్ స్కామ్
హజారీబాగ్ జిల్లాలో ఇప్పుడు దీన్ని ఆధార్ కార్డ్ స్కామ్ అని పిలుస్తున్నారు. జనం ఆధార్ కార్డ్ నెంబర్లు తీసేసుకుని వాటి ఆధారంగా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అమర్చినట్లు రాసుకున్నారు. నిధులు స్వాహా చేశారు. పొలాలకు వెళ్లి చూస్తే ఎక్కడా డ్రిప్ ఇరిగేషన్ జరగడం లేదు. కొంత మందికి తెలియకుండానే వారి ఆధార్ నెంబర్లు వెళ్లిపోయాయి. అదంతా ఏజెట్ల చేతివాటమని తెలిసి.. ఇప్పుడు పేద రైతులు గగ్గోలు పెడుతున్నాయి. పొలాల్లో నిలబడి ఫోటోలు తీయించుకుంటే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడంతో కొందరు రైతులు చేతిలో ఆధార్ కార్డ్ పట్టుకుని ఫోజులిచ్చి ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి. కొన్ని చోట్ల ఆధార్ కార్డులో పేరుకు, అసలు పేరుకు పొంతనలేదు. ఈ అంశాలన్నింటనీ జార్ఖండ్ ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్తే ఆయన సమాధానం విచిత్రంగా ఉంది. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ నిర్వాహణ నాలుగైదు ప్రైవేటు కంపెనీలకు అప్పగించామని, వారు ఏదైనా స్కామ్ చేస్తే తమకు సంబంధమేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయినా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మొక్కుబడి సమాధానం చెప్పారు..
జనం మాత్రం ఒక మాట చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అంటే స్కాములే కదా. జార్కండ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా ఉంది కదా. స్కామ్ జరగడం సహజమే కదా అని జనం అంటున్నారు. అదీ కాంగ్రెస్ కున్న ట్రాక్ రికార్డ్ ….