రొమ్ము కాన్సర్ కి బెస్ట్ మెడిసిన్ ఇవి!

మారుతున్న జీవనశైలి వలన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇది వారసత్వంగా అయినా రావొచ్చు, లేదా తల్లి అయ్యాక శరీరంలో వచ్చే మార్పుల కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కనిపించే కణితులన్నీ క్యాన్సర్లు కాదు.. వీటిలో కొన్ని మాత్రమే క్యాన్సర్‌గా మారుతాయి. ఇంతకీ రొమ్ము క్యాన్సర్ ఎందుకొస్తుంది?

రొమ్ము కాన్సర్ ఎందుకు వస్తుంది
వారసత్వంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలిన 90 శాతం మాత్రం…మద్యం, ఊబకాయం, వయసు మళ్లిన తర్వాత గర్భధారణ, పిల్లలకు పాలు పట్టకపోవడం కారణమవుతున్నాయి. దీనిని తొలి దశలోనే గుర్తిస్తే తొందరగానే నివారించవచ్చు. ఈ రొమ్ము క్యాన్సర్‌లో కూడా రకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అవిసెలు ఆహారంలో చేర్చుకోండి
అవిసె గింజలు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మహిళల్లో వచ్చే రొమ్ము కాన్సర్ కి చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవిసెగింజల్లో ఉండే “లిగ్నంట్లు” అనే పదార్ధం రొమ్ము కాన్సర్ విరుద్ధంగా పోరాడే లక్షణాల్ని కలిగిఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవిసె గింజలు పేగు సూక్ష్మజీవులు, క్షీర గ్రంధుల మైక్రోఆర్ఎన్ఏలను ప్రభావితం చేస్తాయని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్ మైక్రోబయాలజీ స్పెక్ట్రమ్‌లో ఇటీవల ప్రచురించిన నివేదిక వెల్లడించింది. రొమ్ము క్యాన్సర్‌లో ఉండే జన్యువులను నియంత్రించడంలో ఈ అవిసె గింజలు సహాయపడి, తద్వారా కణాల అనియంత్రిత విస్తరణను తగ్గిస్తుంది.

క్యాన్సర్ మాత్రమే కాదు..
అవిసె గింజలను శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ గింజలలో ఔషధ గుణాలతోపాటు, ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో లిగ్‌నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌‌‌‌‌‌ పుష్కలంగా ఉన్నాయి. మహిళలలో ఋతు క్రమానికి ముందు తలెత్తే బాధాకరమైన నొప్పులను నివారించడంలో తోడ్పడతాయి.మహిళలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల కారణంగా తలెత్తే హానికారక ప్రభావాలను అవిసెలలోని రసాయనాలు గణనీయంగా తగ్గిస్తాయి. శరీరంలోని కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ నిల్వలను అవిసెలు బాగా తగ్గిస్తాయి. మానసిక ఏకాగ్రత, విశ్రాంతిని కల్పించడంలో ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో సాయం చేస్తాయి.

వీటిని పచ్చిగా తినడం కంటే డ్రైరోస్ట్‌ చేసి, పొడి చేసుకుని తింటే మంచిది. నానపెట్టి మొలకల తిన్నా మంచిదే. ఈ గింజలు నీళ్లలో వేసినప్పుడు జెల్లీలా మారతాయి. ఇవి నీళ్లను ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకే వీటిని తిన్న తర్వాత నీళ్లు ఎక్కువ తాగాలి. లేదంటే మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.