ముంబైలో పేలుళ్లకు భారీ కుట్ర – భగ్నం చేసిన ఏటీఎస్

ఉగ్రవాదం మన దేశానికి పెద్ద శాపంగా మారింది. దేశంలో ఎక్కడోక్కడ దాడులు, పేలుళ్లు సృష్టించి మారణహోమానికి ఉగ్ర కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు ఈ కుట్రలను భద్రతా దళాలు ముందే కనిపెట్టి భగ్నం చేయడంతో సామూహిక జనహననం తప్పుతోంది. ఐనా లష్కరే తయ్యబా, జైషే మొహ్మద్, ఐసిస్, పీఎఫ్ఐ లాంటి సంస్థల ఉగ్రవాదులు అప్పుడప్పుడు తమ దుశ్చర్యలను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

పుణెలో ఇద్దరి అరెస్టు

పుణె యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. రాజస్థాన్లో ఎన్ఐఏ నిర్వహించిన దాడుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వారిని పట్టుకున్నారు. 26/11 తరహాలో ముంబైలో మరోసారి భారీ మారణకాండ సృష్టించేందుకు వారు పెద్ద ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది. వారిని మొహ్మద్ ఇమ్రాన్, మొహ్మద్ యూనిస్ గా గుర్తించారు. విచారణ తర్వాత వారికి సహాయపడిన రత్నగిరి వాసి సిమబ్ నసిరుద్దీన్ కాజీ,గ్రాఫిక్ డిజైనర్ ఖాదిర్ దస్తగీర్ పఠాన్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హార్డ్ కోర్ ఐసిస్ సభ్యులుగా ప్రాథమిక విచారణలో తేలింది.

రెక్కి నిర్వహించిన ఉగ్రవాదులు

ముంబైలోని ఛాబా హౌస్, కలాబాలోని నావల్ హెలీప్యాడ్, జల విద్యుత్ కేంద్రాలను పేల్చేందుకు ఈ ఉగ్రవాదులు భారీ కుట్ర పన్ని రెక్కి కూడా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడే ఆలయాల దగ్గర బాంబులు పెట్టేందుకు కూడా వీరు ప్లాన్ చేశారు. దేశ ఆర్థిక వనరులను దెబ్బకొట్టేందుకు వారు జల విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేయాలనుకున్నారిు. వారి వద్ద ఉన్న ల్యాప్ పరశీలించిన తర్వాత భారీ కుట్ర బయటపడింది. ముంబై, పుణెలో వీఐపీల కదలికలకు సంబంధించిన వీడియోలను కూడా వారి ల్యాప్ టాప్ లో ఉన్నాయి. ఒక పక్క రెక్కీ నిర్వహిస్తూ మరో సారి పేలుళ్లు సృష్టించేందుకు కొందరు ఉగ్రవాదులకు వాళ్లు శిక్షణ ఇస్తున్నట్లుగా గుర్తించారు.

సకాలంలోనే అరెస్టు

ఉగ్రవాదులను సకాలంలోనే అరెస్టు చేశామని లేనిపక్షంలో భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని పుణె ఏటీఎస్ అధికారులు అంటున్నారు. వారికి విదేశాల నుంచి నిధులు వస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఆ నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయో గుర్తించాల్సి ఉందని, అందుకే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు వివిధ శాఖలను సమన్వయం చేసుకోవాల్సి ఉందని చెబుతోంది. భారీ స్థాయిలో ట్రైనింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకోవడంతో వారి వద్ద చాలా ఎక్కువ మంది ఉగ్రవాద శిక్షణ పొంది ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వారంతా ఎక్కడున్నారనేదే ప్రశ్న. మొహ్మద్ ఇమ్రాన్, మొహ్మద్ యూనిస్ విచారణ యుద్ధ ప్రాతిపదికన కొనసాగించి తప్పించుకున్న ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నారో పట్టుకోవాల్సిన అనివార్యత ఉంది. లేనిపక్షంలో భారీ దాడులు జరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన భద్రతా దళాల్లో కూడా కనిపిస్తోంది.