“మన్‌ కీ బాత్” మాట కాదు మంత్రం !

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. ఈ కార్యక్రమం ప్రజల జీవితాలపై అనూహ్యమైన మార్పు తీసుకు వచ్చిందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రసార భారతి మాజీ సీఈఓ శశి శేఖర్ వెంపటి ఈ అంశంపై ఓ సమగ్రమైన పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకంలో మన్ కీ బాత్ మాట కాదని.. ఓ మంత్రమని తెలిపేలా అనేక ఉదాహరణలను కూడా శశిశేఖర్ వివరించారు.

స్ఫూర్తి రగిలించిన మోదీ మన్ కీ బాత్

దేశంలోని మారుమూల ప్రాంతాలతోపాటు.. ప్రజలందరికీ తన మనస్సులోని మాటలు, అనుసరిస్తున్న విధానాలు, ప్రముఖ వ్యక్తుల జీవితాలు.. ఇలా ఎన్నో అంశాలు చేరువ కావాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014 అక్టోబర్ 3న తొలి ఎపిసోడ్ ప్రారంభమయింది. ప్రతినెల చివరి ఆదివారం.. ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. దీనిలో ఆసక్తికర విషయాలను చెప్పడంతోపాటు.. పలు అంశాల గురించి ప్రధాని మోడీ వివరిస్తారు. మన్‌ కీ బాత్‌లో సామాన్యులకు తెలియని అనేక విషయాలను.. ప్రధాని మోడీ సవివరంగా చెప్పే తీరు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం ప్రారంభించిన కొన్నాళ్లకే.. ఎంతో ప్రజాదరణను పొందింది.

అన్‌సంగ్ హీరోలను వెలుగులోకి తెచ్చిన ప్రదాని మోదీ

ఈ కార్యక్రమాన్ని అసాంతం పరిశీలించిన ప్రసార భారతి మాజీ సీఈఓ శశిశేఖర్ వెంపటి “కలెక్టివ్ స్పిరిట్, కాంక్రీట్ యాక్షన్స్” అనే పుస్తకాన్ని రాశారు. మన్ కీ బాత్ కార్యక్రమం.. భారతదేశంపై దాని ప్రభావం.. అనే విషయాలను అందులో వివరించారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ ఎలాంటి మార్పులకు నాంది పలికారు.. అదేవిధంగా సమాజంపై ఎలాంటి ప్రభావం చూపించింది.. అనే విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమం భారతదేశ ప్రజల్లో ఎలాంటి బలమైన మార్పును తీసుకువచ్చిందో సవివరంగా.. దానిలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. కార్యక్రమానికి ముందు.. ఆ తర్వాత విషయాలను కూడా ప్రస్తవించారు . సమాజానికి మేలు చేస్తూ వెలుగులోకి రాని ఎంతో మంది గురించి ప్రపంచానికి తెలిపారు మోదీ.

వంద కోట్ల మందికి చేరువైన ప్రోగ్రాం !

ఈ ప్రోగ్రామ్ కు అత్యధిక రేటింగ్ వచ్చింది. 100 కోట్ల మందికి పీఎం మన్ కీ బాత్ చేరువైంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని పలు భాషల్లో, పలు ప్లాట్‌ఫాంలలో సైతం ప్రసారం చేయడంతో.. ఇది అనేక మందికి చేరువైనట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. మన్‌ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్‌కు చేరువైంది. ఏప్రిల్‌ 30వ తేదీన జరిగే ఎపిసోడ్‌తో 100వ ఎపిసోడ్‌ పూర్తి చేసుకోనుంది. ఈ 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ.. ఏ విషయం గురించి మాట్లాడతారు, ఎలాంటి విషయాలను ప్రస్తావిస్తారనేది దేశప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.